ఎన్నికల వేళ హామీలతో పార్టీలు పోటీ పడుతున్నాయి. మధ్యప్రదేశ్లో వారం రోజుల లోపే పోలింగ్ జరుగుతుండగా ఓట్లర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ప్రతీ ఓటు కీలకమేనన్న ఆలోచనతో పార్టీలు పాచికలు వేస్తున్నాయి.
మహిళా ఓటర్లే టార్గెట్…
మధ్యప్రదేశ్లో 48 శాతం మంది మహిళా ఓటర్లున్నారు. 18 కీలక నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే వాళ్లే అధికం. దానితో మహిళలను ఆకట్టుకునే దిశగా బీజేపీ మేనిఫెస్టోలో అనేక ఆకర్షణీయమైన అంశాలను చేర్చారు. లాడ్లీ బెహనా యోజనా క్రింద నగదు సాయం అందుకునే వారికి రాయితీ గ్యాస్ సిలెండర్ ను రూ. 450కే అందిస్తామని ప్రకటించారు. మోదీకి గ్యారెంటీ, బీజేపీ కా భరోసా పేరుతో 96 పేజీల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆవిష్కరించారు. సీఎం కిసాన్ కల్యాణ్ యోజన కింద రూ. 12,000 ఇస్తామని కూడా అందులో ప్రస్తావించారు. పేద కుటుంబాల్లో అమ్మాయిలకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు. లాడ్లీ బెహనా యోజన లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు.
కాంగ్రెస్ రుణమాఫీ, ఉచిత విద్యుత్
కాంగ్రెస్ పార్టీ కూడా జనాన్ని ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన హామీలే ఇచ్చింది. 100 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు, 200 యూనిట్ల వరకు సగం ధరే వసూలు చేస్తామని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ప్రకటించారు. రైతులకు రుణమాఫీ, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, పేద పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య,పంటలకు మద్దతు ధర పెంపు లాంటివి కాంగ్రెస్ హామీలుగా ఉన్నాయి. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సంధిస్తోంది. లాడ్లీ బెహనా యోజన సాయాన్ని రూ.3,000కు పెంచుతామని బీజేపీ ప్రకటించిందని, అయితే ఆ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చలేదని గుర్తు చేస్తూ ఓటర్లను మోసగిస్తున్నారని ఆరోపించింది.
అధికారులను బెదిరిస్తున్న కమల్ నాథ్…
కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ..మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులపై మండిపడుతూ వారిని బెదిరిస్తున్నారు. వారం రోజుల్లో తాము అధికారంలోకి వస్తున్నామని, ఇష్టానుసారం వ్యవహరిస్తున్న అధికారుల అంతు చూస్తామని కమల్ నాథ్ హెచ్చరించారు. నివారీ జిల్లా ఎన్నికల ప్రచారం సందర్భంగా అధికారుల తీరును ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలను అధికారులు వేధిస్తున్నారని, అధికారానికి వచ్చిన వెంటనే అలాంటి అధికారులను ఉపేక్షించేది లేదని అన్నారు. కమల్ నాథ్ వ్యవహార శైలిపై బీజేపీ మండిపడుతోంది. కమల్ నాథ్ అహంకారంతో ప్రకటనలు చేస్తున్నారని సీఎం చౌహాన్ తో పాటు అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ కూడా ఆరోపణలు సంధించారు. ఆయన ధమ్కీ కి దుకాన్ నడుపుతున్నారని బీజేపీ అంటోంది. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని కమల్ నాథ్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.