దేశ రాజధానికి చేరువగా ఉండే హరియాణాలోని నుహ్ జిల్లాలో మత ఘర్షణలు సంచలనం సృష్టించాయి. విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్ లో చెలరేగిన మర్షణల్లో ఇద్దరు హోం గార్డులు, ఒక మతగురువు మరణించారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. బజరంగ్ దళ్ కార్యకర్తల చేసిన ఒక ప్రకటనతో మరో మతం వారు రెచ్చిపోయి దాడులకు దిగారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
పక్కా ప్రణాళికతోనే చేశారంటున్న అనిల్ విజ్
నుహ్ దమనకాండ పక్కా ప్రణాళికతోనే జరిగిందని హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ అన్నారు. కాల్పుల ఘటనలు ముందస్తు వ్యూహంతో జరిగాయని ఆయన విశ్లేషించారు. పైకప్పులపై ఉన్న రాళ్లను సేకరించి కొండలపైకి వెళ్లి కాల్పులు జరిపినట్లు తమకు పక్క సమాచారం ఉందని ఆయన చెబుతున్నారు. పక్కా గేమ్ ప్లాన్ తో దేవాలయాల పక్కన కొండలు ఎక్కి, చేతుల్లో లాఠీలు పట్టుకుని విశ్వహిందూ పరిషత్ ఊరేగింపు ఎంట్రీ పాయింట్ వద్ద కూడా దుండగులు గుమ్మిగూడాలని అనిల్ విజ్ వెల్లడించారు. అయితే పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి రాగలమని ఆయన చెబుతున్నారు.
రోహింగ్యాలపైనా అనుమానం
బర్మా, బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చిన రోహింగ్యా శరణార్థులే ఘర్షణలకు ఆజ్యం పోశారని ఒక వాదన ప్రచారంలో ఉంది. ఘర్షణల తర్వాత పలువురు రోహింగ్యా శరణార్థులను హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. హరియాణా పట్టణాభివృద్ధి సంస్థకు సంబంధించిన స్థలాన్ని రోహింగ్యా శరణార్థులు ఆక్రమించుకున్నారని నుహ్ పోలీస్ సూపరింటెండెంట్ నరేంద్ర బిజార్నియా తెలిపారు. వారిలో కొందరు ఈ విశ్వహిందూపరిషత్ ఊరేగింపుపై రాళ్లు రువ్వినట్లు పోలీసులు గుర్తు చేశారు. మరో పక్క ఆప్ నేత జావెద్ అహ్మద్ కూడా ఈ ఘర్షణలను ప్రేరేపించారని ఆరోపణలు వస్తున్నాయి. మత గురువు హత్య వెనుక ఆయన హస్తం ఉందని వార్తలు వ్చచాయి. అయితే కేవలం రాజకీయ దురుద్దేశంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని జావెద్ అహ్మద్ అంటున్నారు. తమ పార్టీ ఇమేజ్ ను డేమేజ్ చేసే ప్రయత్నం జరుగుతోందని ప్రత్యారోపణ చేస్తున్నారు..
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తల ప్రచారం
సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు, ముందు వెనుక చూసుకోకుండా వాటిని ఫార్మర్డ్ చేయడం కారణంగా కూడా హింస పెరిగిందని హరియాణా పోలీసులు గుర్తించారు. రెండు వర్గాలు ఫేక్ న్యూస్ ప్రచారం చేసేందుకు కొత్త ట్విట్టర్ ఖాతాలు కూడా తెరిచాయని హరియాణా సైబర్ క్రైమ్ నివారణ శాఖ గుర్తించింది. ఆలయాల్లో తలదాచుకున్న మహిళలను తీసుకెళ్లి రేప్ చేస్తున్నారని, మసీదులను తగులబెడుతున్నారని కొందరు ఫేక్ ప్రచారం చేశారు. దానితో ఒకటి రెండు సార్లు హింస కొనసాగింది. ఇవన్నీ అబద్ధాలేనని ప్రకటన ఇచ్చిన ప్రభుత్వం ఇంటర్నెట్ పై నిషేధం విధించింది. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు నుహ్ ప్రాంతంలో ఈ నిషేధం కొనసాగుతుంది. కర్ఫ్యూను మాత్రం మరికొంత సడలించారు.
కూల్చివేతలపై కోర్టు స్టే…
హింసకు, అల్లర్లకు, ఇళ్లు తగులబెట్టేందుకు కారణమైన వారిపై హరియాణా సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. వారి స్థిరాస్తులను నేలమట్టం చేసి బుద్ధి చేతుబోంది. రోహింగ్యాల లాంటి అక్రమ వలసదారులు ఆక్రమించుకుని కట్టుకున్న ఇళ్లు, షాపులను బుల్డోజర్లు పెట్టి నేలమట్టం చేస్తోంది. మొత్తం 700 కట్టడాలను నేలమట్టం చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.వీరిలో ముస్లింలే కాకుండా హిందువులు కూడా ఉన్నారు. హింసలో పాత్రధారులు, సూత్రధారులు ఏ మతంవారైనా సరే క్షమించేది లేదని ప్రభుత్వం నిగ్గు తేల్చింది. ఘర్షణ జరిగిన రోజున కొందరు దుండగులు రెస్టారెంట్లో ఉండి రాళ్లు విసిరారు. ప్రభుత్వం ఇప్పుడు ఆ రెస్టారెంట్ ను కూడా బుల్డోజర్ తో తొక్కించేసింది. అక్రమ వలసదారుల గుడిసెలను కూడా తొలగించారు. మొత్తం 57 ఎకరాలకు ఆక్రమణల నుంచి విముక్తి కలిగించారు. మరో పక్క కూల్చివేతలపై పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అయితే స్టే విధింపుపై అప్పీలుకు వెళతామని హరియాణా ప్రభుత్వం అంటోంది.