రోడ్ షోలు – అత్యంత ఆకర్షణీయమైన ఈవెంట్స్

ఐదు రాష్ట్రాల ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ప్రచారం తారా స్థాయికి వెళ్లిపోయింది. ఓటకు దేవుళ్లను ఆకట్టుకునేందుకు నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. అగ్రనేతలంతా ఢిల్లీలో ఉండే కంటే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తిరిగేందుకే ఇష్టపడుతున్నారు. పబ్లిక్ మీటింగులతో సమానంగా రోడ్ షోలు నిర్వహించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాహుల్, ప్రియాంక నిర్వహించే ప్రతీ రోడ్ షోకు మోదీ, అమిత్ షా కౌంటరిస్తున్నారు. అంతకంటే ఎక్కువగా జనాన్ని ఆకట్టుకుంటూ రోడ్ షోలు జరుపుతున్నారు….

ఇండోర్‌లో మోదీ , ప్రియాంక

17న మధ్యప్రదేశ్‌లో పోలింగ్ జరుగుతోంది. దానితో ఇండోర్, జబల్బూర్, భోపాల్‌లో ప్రతిష్ఠాత్మకమైన రోడ్ షోలు జరిగాయి. ప్రధాని మోదీ ఇండోర్ నగరంలో కిలోమీటరున్నర రోడ్ షో జరిపారు. అందులో ఎక్కువ భాగం ఇండోర్ వన్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అక్కడ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ సుక్లాపై ఆయన పోటీ పడుతున్నారు. ప్రియాంకగాంధీ కూడా గత వారం ఇండోర్ వన్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. అయితే ప్రధాని మోదీ… బడా గణపతి ఆలయం నుంచి దేవి అహల్యా విగ్రహం వరకు నిర్వహించిన రోడ్ షోకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. మోదీ..మోదీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది.

జబల్బూర్‌లో రాహుల్ వర్సెస్ అమిత్ షా

రోడ్ షోల పోటీకి జబల్బూర్ కూడా వేదికైంది. గత వారం ఆయన మూడు కిలోమీటర్లు తిరిగారు. ఎక్కువ సమయం జబల్పూర్ పడమట నియోజకవర్గంలో రోడ్ షో జరిపారు. అక్కడ మాజీ ఆర్థిక మంత్రి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే తరుణ్ భానోత్ పోటీ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ ఈ సారి అసెంబ్లీ బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. రాహుల్ వచ్చి వెళ్లిన సంగతి తెలియగానే రాష్ట్ర నాయకులు అమిత్ షా రోడ్ షోను ఏర్పాటు చేశారు. అమిత్ షాకు అక్కడ విశేష ఆదరణ లభించింది.

ఓల్డ్ భోపాల్‌లో పోటా పోటీ…

ఈ సారి ఓల్డ్ భోపాల్‌లో కూడా రోడ్ షాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. భోపాల్ ఉత్తర, భోపాల్ సెంట్రల్ స్థానాలను తాకుతూ నిర్వహించిన రోడ్ షోలో రాహుల్ వెంట పలువురు రాష్ట్ర నేతలు హాజరయ్యారు. రెండు చోట్ల మైనార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. భోపాల్ నార్త్ స్థానంలో 1998 నుంచి కాంగ్రెస్ మైనార్టీ నేత అరీఫ్ అకీల్‌ విజయం సాధిస్తూ వచ్చారు. ఈ సారి ఆయన కుమారుడు అతీక్ అకీల్ ను పోటీ చేయిస్తున్నారు. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే . జనాన్ని ఆకట్టుకునేందుకు రాహుల్ తో రోడ్ షో జరిపించారని భావిస్తున్నారు. భోపాల్ సెంట్రల్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అరీఫ్ మసూద్ కొంచెం వత్తిడిని ఎదుర్కొంటున్నారు. రాహుల్ పర్యటన ఆయనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు..