కడపలో వైసిపి ఓటమికి సొంత నేతలే పని చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. డప అసెంబ్లీ అభ్యర్థి ఎస్బి.అంజాద్‌బాషా, పార్లమెంట్ అభ్యర్థి వైఎస్.అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా కడపకు చెందిన ఓ కీలక నాయకుడి వెన్నుపోటు రాజకీయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈయన సహకారంతో మరో ఏడుగురు కార్పొరేటర్లు సైతం టిడిపి ఎరకు లొంగిపోయినట్లు సమాచారం. కడప అసెంబ్లీలో వైసిపి గెలుపు కోసం పోటాపోటీ పరిస్థితి తీసుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
కడపలో కూటమి అభ్యర్థి గెలుపుపై అంచనాలు
కడప అసెంబ్లీ పరిధిలో 2.83 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో 65.27 శాతం నమోదైంది. కడప అసెంబ్లీ బరిలో వైసిపి తరపున డిప్యూటీ సిఎం ఎస్బి.అంజాద్‌బాషా, టిడిపి తరుపున మాధవి, కాంగ్రెస్ తరుపున ఆప్జల్‌ఖాన్ ప్రధాన పార్టీల తరుపున అభ్యర్థులుగా పోటీ పడ్డారు. వైసిపి నాయకుల వెన్నుపోటు, లొంగుబాటు కారణాలు కావడం విస్మయాన్ని కలిగిస్తోంది.రచ్చ గెలవడంలో డిప్యూటీ సిఎం సార్వత్రిక ఎన్నికల టికెట్‌ను దక్కించుకోవడంలో ఇంటిపోరు గెలిచిన డిప్యూటీ సిఎం.అంజాద్‌బాషా, వీధిపోరును గట్టెక్కడంలో ఎదురీదుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అంజాద్ భాషాకు హ్యాండిచ్చిన కీలక నేత
ఆయనకు సన్నిహితుడైన ఓ కీలక వైసిపి నాయకుని వెన్ను పోటు కారణంగానే గెలుపు కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి దాపురించిందనే చర్చ నడుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 53 వేల ఓట్లపైచిలుకు గెలిచిన నాయకుడు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వెన్నుపోట్ల కారణంగా పోరాటం చేయాల్సిన రావడం గమనార్హం. సదరు నాయకుడు పార్టీలోనూ, పార్టీయేతర కీలక పదవిలోనూ కొనసాగుతూ ఇలా చేయడమేమిటనే చర్చ నడుస్తోంది. ఫలితంగా సదరు కీలక నాయకుడి పరిధి లోని ఓ సామాజికవర్గపు ఓటర్లు టిడిపి అభ్యర్థి వైపు మొగ్గు చూపిస్తున్నారని తెలిసినప్పటికీ ప్రేక్షకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. లొంగుబాటు నాయకులు జగన్‌కు ఝలక్ ఇచ్చినట్లు అవుతోందనే వాదన వినిపిస్తోంది.
ఫలితాలపై వైసీపీలో ఆందోళన
కడప అసెంబ్లీ పరిధిలో ప్రభావిత సామాజిక వర్గాలైన ముస్లిమ్, క్రిస్టియన్ ఓటర్లను ప్రత్యర్థులైన టిడిపి, కాంగ్రెస్ కొల్లగొట్టే ప్రయత్నం చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యులైన సదరు వైసిపి నాయకులు కలిసి కట్టుగా శ్రమించాలి. ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి. ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా ప్రత్యర్థుల ఎరకు లొంగిపోయరనే ప్రచారంతో వైసీపీ నేతలు డీలా పడిపోతున్నారు.