ప్రతీకారం అంటే ప్రత్యర్థిని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!

‘ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటా’ అనే మాట చాలామంది నోటినుంచి వింటుంటాం. అయితే ప్రతీకారం తీర్చుకోవడం అంటే వారిపై గెలవడం కాదంటాడు ఆచార్య చాణక్యుడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నప్పుడు తిరిగి మళ్లీ లేచే అవకాశం కూడా ఇవ్వకూడదంటాడు. అసలు చాణక్యుడి గెలుపు ప్రారంభమైందే ప్రతీకారంతో..

నందుడిపై కాత్యాయనుడి పగ
మగధ దేశాన్ని ధననందుడు పాలించే రోజులవి. ధననందుడు గొప్ప వీరుడే కానీ ప్రజాభిమానం పొందలేకపోయాడు. అహంభావి, క్రూరుడు అయిన ధననందుడు తన మంత్రి కాత్యాయనుడిని, కుమారులను బంధించి వేధించాడు. హింస భరించలేక కాత్యాయనుడి పిల్లలంతా చనిపోయారు. కొన్నాళ్ల తర్వాత కాత్యాయనుడి తప్పు లేదని తెలుసుకుని విడిచిపెట్టిన ధననందుడు మంత్రిగా కొనసాగించాడు. కానీ తన పిల్లల్ని చంపిన రాజుపై పగ అలాగే ఉండిపోయింది. పైకి మామాూలుగా ఉన్నా పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూశాడు. అలాంటి సమయంలో కనిపించాడు చాణక్యుడు.

చాణక్యుడిపై పడిన కాత్యాయనుడి చూపు
రాజ్యంలో అంతమంది ఉన్నా కాత్యాయనుడి చూపు చాణక్యుడిపై ఎందుకు పడిందో చెప్పుకోవాలంటే ఇక్కడ చాణక్యుడి తండ్రి చణకుడి మరణం గురించి చెప్పుకోవాలి. ఉన్నత విద్యాబుద్దులు, వేదాలు నేర్పించిన తండ్రి శాశ్వతంగా దూరమవడాన్ని చాణక్యుడు తట్టుకోలేకపోయాడు. తండ్రి మృతదేహం దగ్గర కూర్చుని ఏడుస్తున్న చాణక్యుడికి ఓ వార్త తెలిసింది. ఇంటి చుట్టూ సూదుల్లా ఉన్న గడ్డిపై నడిచిన సమయంలో తండ్రి కాలికి గాయం అయిందని ఆ గాయం పెద్దదై చనిపోయాడని తెలిసింది. అంతే…గడ్డిపై అంతులేని కోపం వచ్చింది చాణక్యుడికి. తన తండ్రి మరణానికి కారణం అయిన గడ్డిపై ప్రతీకారం తీర్చుకోవాలునుకున్నాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తైన మర్నాటి నుంచి చాణక్యుడు ఇంటి ఆవరణలో ఉన్న గడ్డిని పెకిలించడం మొదలు పెట్టాడు. గడ్డిని పెరికి మొదట్లో పంచదార నీళ్లు పొయ్యడం ప్రారంభించాడు. ఇదంతా గమనించాడు అటుగా వెళుతున్న కాత్యాయనుడు.

గడ్డిపై ప్రతీకారంతో మొదలైన విజయం
ఏంటీ పని ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు కాత్యాయనుడు. ఆ సమయంలో చాణక్యుడు చెప్పిన సమాధానం కాత్యాయనుడిలో ఆశలు నింపింది. సూదుల్లాంటి ఈ గడ్డిపై పాదం మోపడం వల్ల తన తండ్రి చనిపోయాడని అందుకే గడ్డిపై ప్రతీకారం తీర్చుకుంటున్న చాణక్యుడు… ఆ గడ్డి మళ్లీ మొలవకుండా పంచదార నీళ్లు పోస్తున్నా అని బదులిచ్చాడు. పంచదార నీళ్ల వల్ల చీమలు చేరి మొదలు రాకుండా కొరికేస్తాయన్నమాట. ఆహా తనకు కావాల్సింది ఇలాంటి వ్యక్తే కదా అని నందుడిపై ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు కాత్యాయనుడు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం నందుడి కోటలోకి చాణక్యుడిని పంపించడం అక్కడ అవమానం జరగడంతో నందవంశాన్ని నాశనం చేస్తానని శపథం చేయడం జరిగింది. అలా గడ్డిపై ప్రతీకారంతో మొదలైన చాణక్యుడి విజయం నందవంశాన్ని సమూలంగా నాశనం చేసి చంద్రగుప్త మౌర్యుడికి పట్టంకట్టి పాలించే వరకూ అప్రతిహతంగా సాగింది

అంటే ఎవరిపైన అయినా పగ, ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు ఏదో సమాధానం చెప్పి, తిరుగుబాటు చేసి వదిలేయడం కాదు.. మళ్లీ వాళ్లు లేవకూడనంతగా దెబ్బ కొట్టాలి, మళ్లీ తిరుగుబాటు చేయాలనే ఆలోచనను చంపేయాలి. అదే నిజమైన ప్రతీకారం అన్నది చాణక్యుడు అభిప్రాయం…