” బ్రో ” సినిమా డబ్బింగ్ కోసం రెస్ట్ – అనారోగ్యమని ప్రకటన – జనసేనాని తీరుపై విమర్శలు !

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా తాను అమ్మవారి దీక్షలో ఉన్నానని… అన్నమే తినడం లేదని ఫ్రూట్స్ తో సరి పెట్టుకుంటున్నానని చెబుతున్నారు. ఈ కారణంగా నీరసంగా ఉందని మూడు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు అలాగే మూడు రోజుల పాటు విరామం కూడా ఇచ్చారు. 30వ తేదీన మళ్లీ బీమవరంలో బహిరంగసభ ఉంటుందని చెబుతున్నారు. కానీ వాస్తవం మాత్రం ఆయన సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

బ్రో సినిమా డబ్బింగ్ చెబుతున్న పవన్

జనసేనాని ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆయనకు అనారోగ్యం ఉందో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతం భీమవరంలో ఆయన బస చేసిన ప్రాంతానికి బ్రో సినిమా యూనిట్ వచ్చింది. ఓ డబ్బింగ్ యూనిట్ ను కూడా తీసుకు వచ్చారు. అక్కడ పవన్ కల్యాణ్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఇది రెండు రోజుల పాటు ఉండే పని కావడంతో ఈ రెండు రోజులు విశ్రాంతి పేరుతో సెలవు తీసుకున్నారని అంటున్నారు. అయితే నేరుగా సినిమా పనుల కోసం షెడ్యూల్ గ్యాప్ ఇచ్చామని చెబితే… యాత్రలో సీనియర్ నెస్ పోతుందని ఇలా అనారోగ్యం అని చెప్పారంటున్నారు.

షూటింగ్ లు కూడా మంగళగిరిలో తీస్తామంటున్న నిర్మాతలు

పవన్ ఇక ఏపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నందున షూటింగ్‌లు అన్నీ ఏపీలోనే చేయాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్ లొకేషన్స్‌గా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. . పవన్ కళ్యాణ్ ఇక నుంచి మంగళగిరిలోనే ఉంటారని అంటున్నారు. ప‌వ‌న్ సినిమాతో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు కూడా ప‌రిశ్ర‌మ‌లో షూటింగ్ నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏపీ, విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తామని దర్శకులు ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ విజయవాడలోనే మకాం వేసి తన మిగిలిన సినిమాల షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అయితే సినిమాలకు సమయం కేటాయిస్తారా లేకపోతే… రాజకీయాలకా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.

ఇప్పటికి రెండు పడవలపైనే పవన్ ప్రయాణం

2024లో ఎన్నికలు వస్తాయని పవన్ కల్యాణ్ తెలియనిదేం కాదు. పార్టీని నడపడానికి సినిమాలు చేయాల్సిందేనని చెబుతున్న ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ… ఎన్నికలుక ఆరు నెలల ముందుగా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. కానీ అలా చేయకపోవడంతో ఇప్పుడు ఎన్నికలకు ముందుగా సినిమాలు, రాజకీయాలు కలిసి చేయాల్సి వస్తోంది. ఇందు కోసం అబద్దాలు కూడా చెప్పాల్సి వస్తోంది. కానీ ఈ సోషల్ మీడియా కాలంలో నిజాలు తెలియకుండా ఉంటాయా ?