నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్

కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకు రావడం ద్వారా అతివల రాజకీయ హక్కులకు మరింత చేయూతనిచ్చిందనే చెప్పాలి. కాకపోతే ప్రక్రియ పూర్తయి రిజర్వేషన్ అమలుకు రావడానికి మాత్రం కొంత టైమ్ పట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదీ చారిత్రక నిర్ణయమని మోదీ స్వయంగా ప్రకటించడం ద్వారా బిల్లుపై బీజేపీకి, స్వయంగా తనకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.

కీలక సమయంలో బిల్లు

బిల్లు బుధవారం లోక్ సభలో, శుక్రవారం రాజ్యసభలో ఆమెదం పొందుతుందని బీజేపీ వర్గలు ఎదురు చూస్తున్నాయి. నిజానికి బిల్లును అనేక దశల్లో ఆమోదిస్తేనే రాష్ట్రపతి ముద్ర పడి అది చట్టంగా మారుతుంది. తొలుత పార్లమెంటు ఉభయ సభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆమోదం పొందాలి. అది ఈ ప్రత్యేక సమావేశాల్లోనే పూర్తవుతుందని చెబుతున్నారు. తర్వాత ఆ బిల్లు రాష్ట్రాల శాసనసభలకు వెళ్తుంది. దేశంలోని సగం అసెంబ్లీలు దాన్ని ఆమోదించినప్పుడే బిల్లుకు పరిపూర్ణత చేకూరుతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

2029కి అమలు…

మహిళా రిజర్వేషన్ అమలు చేసే లోపు… నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోవాలి. 2026లో జనాభా గణాంకాలు పూర్తి చేసి (నిజానికి 2021లో పూర్తి కావాలి, అది జాప్యమైంది) అప్పుడే నియోజకవర్గాల పునర్విభజన జరుపుతారు. కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభా, అసెంబ్లీ స్థానాలు పెరగొచ్చు. కొన్ని చోట్ల తగ్గే అవకాశం ఉంటుంది.కొత్త నియోజకవర్గాల ప్రకటన తర్వాతే ఎస్సీ, ఎస్టీ కోటాలో మార్పులను కూడా నిర్థారించాల్సి ఉంటుంది. అవన్నీ పుర్తయి రిజర్వేషన్ అమలు జరగటానికి 2029 రావచ్చని అంచనా వేస్తున్నారు. అంటే మహిళ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికయ్యే తొలి మహిళలు 2029లో పార్లమెంటు గడప ఎక్కుతారు. ఈ లోపు స్వచ్ఛందంగా 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడం పార్టీల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది.

సంబరాలకు సిద్ధమవుతున్న బీజేపీ

లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలోనే సంబరాలు జరపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి ఢిల్లోలో వేడుకలు జరపాలని భావిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు, మహిళల సమీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఢిల్లీలో లేదా పక్కనున్న హరియాణాలో విజయోత్సవ ర్యాలీ తరహాలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఆ సభలో పాల్గొని దేశంలోని మహిళలు అందరికీ శుభాకాంక్షాలు చెబుతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మహిళా బిల్లుకు ఆరెస్సెస్ కూడా మద్దతిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో కూడా సమర్థింపు లభిస్తోంది.