ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మాటంటే మాటే. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నారంటే వాటిని అధికారులు తూచ తప్పకుండా పాటించాల్సిందే. శాంతి భద్రతల పరిరక్షణనైనా, ప్రజాపయోగ కార్యక్రమాలైనా వంద శాతం ఫలితాలను ఆయన ఎదురు చూస్తారు. అలా జరగని పక్షంలో ఆయన సీరియస్ అవుతారు. చెప్పిన పని చేసే వరకు నిద్రపోరు.
అధికారులకు క్లాస్
రాష్ట్రంలో మళ్లీ లౌడ్ స్పీకర్ల శబ్దం పెరిగిందని, మత ప్రదేశాల్లో మళ్లీ మోత మోగుతోందని, అది సామాన్య ప్రజలకు ఎంతో అసౌకర్యానికి కారణమవుతోందని యోగి గుర్తించారు. రాజధాని లక్నో నగరంలోనూ, జిల్లాల్లోనూ తన పర్యటనల సందర్భంగా మత సంస్థల దగ్గర స్పీకర్ల సౌండ్ పెరిగిందని ఆయనకు అర్థమైంది. దానితో అధికారులను పిలిచి క్లాస్ తీసుకున్నారు. గతంలో తొలగించిన చోటే మళ్లీ లౌడ్ స్పీకర్ల సౌండ్ వినిపిస్తోందని ఆయన గుర్తు చేయడంతో అధికారులు ఖంగు తున్నారు. హోంశాఖ అధికారులంతా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీజే నిర్వాహకులతో కూడా మాట్లాడి సౌండ్ ఎక్కువగా రాకుండా చూసుకోవాలని గట్టిగా చెప్పమన్నారు. ఈ దిశగా సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఆయన గుర్తు చేశారు.
రెండు రోజుల్లో 700 స్పీకర్ల తొలగింపు
సీఎం యోగి సీరియస్ కావడంతో అధికార యంత్రాంగం కదిలింది. చకా చకా పనులు కానిచ్చిన లక్నో పోలీసులు ఆగమేఘాల మీద 400 లౌడ్ స్పీకర్లను తొలగించారు. జనానికి ఇబ్బందిగా పరిణమించిన అన్ని లౌడ్ స్పీకర్లను తొలగించామని పోలీసులు తెలిపారు. ఈ పనిలో ప్రజల సహకారం ఉందన్నారు. లక్నోతో పాటు కాన్పూరులో కూడా రంగంలోకి దిగి నగరంలోని నాలుగు జోన్లలో ఉన్న 320 లౌడ్ స్పీకర్లను తీసేశారు. మిగతా ప్రదేశాల నుంచి ఇంకా వివరాలు రావాల్సి ఉంది.
గతేడాది 57 వేల స్పీకర్ల తొలగింపు
శబ్దం ఎక్కువగా వచ్చే లౌడ్ స్పీకర్ల తొలగింపు ప్రక్రియ గతేడాది అమలుకు వచ్చింది. పోలీసు శాఖ, హోం శాఖ, యూపీ కాలుష్య నియంత్రణా మండలి సంయుక్త కార్యాచరణతో 2022 చివరి నాటికి రాష్ట్రంలో మొత్తం 57 వేల లౌడ్ స్పీకర్లను తొలగించారు. మరో 62 వేల లౌడ్ స్పీకర్ల సౌండ్ ను బాగా తగ్గించే చర్యలు చేపట్టారు. తొలగించిన లౌడ్ స్పీకర్లలో అత్యధికంగా మత సంస్థల దగ్గరివే ఉన్నాయి. చివరకు మీరట్ లోని రాజరాజేశ్వరీ దేవాలయం, కాన్పూరులోని మండీ మఠ్ కో- ఆర్డినేషన్ కమిటీ దగ్గరున్న లౌడ్ స్పీకర్లను కూడా తీసేశారు. అప్పుడు యూపీ ప్రభుత్వం ఒక అంశాన్ని స్పష్టం చేసింది. లౌడ్ స్పీకర్లకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంది. ప్రజలకు అసౌకర్యంగా ఉన్న వాటిని మాత్రమే తొలగిస్తున్నామని తెలిపింది.
ఇప్పుడు రెండో సారి ప్రభుత్వం ప్రత్యక్ష కార్యాచరణకు దిగడంతో మత సంస్థల నిర్వాహకులు దారికి వచ్చారు. మసీదు కమిటీలు సమావేశమై.. లౌడ్ స్పీకర్ల సౌండ్ తగ్గించాలని తీర్మానించాయి. ఈ అంశం లిఖిత పూర్వకంగా స్థానిక అధికారులకు తెలియజేయడంతో అటువంటి లౌడ్ స్పీకర్లపై చర్యలను నిలిపివేశారు.