రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదనే విషయం చాలామందికి తెలుసు. అయితే ఇందులో ఆల్కాహాల్ కలిపినది, కలపనిది రెండూ ఉంటాయి. వీటిలో ఆల్కాహాల్ కలపని రెడ్ వైన్ ని మితంగా తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు తీరిపోతాయని సైన్స్ నిర్ధారించింది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే రెడ్ వైన్ వల్ల ఏవో ఒకటో రెండో సమస్యలకు కాదు..చాలా రోగాలకు రెడ్ వైన్ చెక్ పెట్టేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.
క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది
రెడ్ వైన్ తాగడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించవచ్చు. ముఖ్యంగా రొమ్ము, అన్నవాహిక క్యాన్సర్‌ను తగ్గించే సామర్థ్యం రెడ్ వైన్‌లో ఉన్నట్టు శాస్త్రీయంగా నిరూపణ అయింది.
గుండె కోసం
రెడ్ వైన్‌లో ఉండే ఉత్తమమైన పాలీఫెనాల్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపేందుకు ప్రయత్నిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు రెడ్ వైన్ ఎంతో సహాయపడుతుంది.
కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి
రెడ్ వైన్‌లో ఉండే రెస్వరాట్రాల్ కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే చూపు క్షీణత, మధుమేహం వల్ల కలిగే డయాబెటిక్ రెటినోపతి వంటి కంటి సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది రెడ్ వైన్.
దంతాల ఆరోగ్యానికి
రెడ్ వైన్ తాగడం వల్ల నోటిలో హానికరమైన బ్యాక్టీరియా బయటికి పోతుంది. ఆ బాక్టీరియా నోట్లో ఉండిపోతే దంత క్షయం, చిగుళ్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే రెడ్ వైన్ తాగడం వల్ల దంతాలు కూడా శుభ్రపడతాయి.
డయాబెటిక్ రోగులకు
డయాబెటిస్ ఉన్నవారు రెడ్ వైన్ తాగొచ్చా లేదా అనే డౌట్ ఉండొచ్చు. అయితే అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం ఆల్కహాల్ లేని రెడ్ వైన్ తాగడం వల్ల డయాబెటిక్ రోగులకు ఎంతో మంచిది. రెడ్ వైన్ రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది. రెడ్ వైన్ తాగాక 24 గంటల వరకు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచగలుగుతుంది. అందుకే మితంగా డయాబెటిక్ రోగులు రెడ్ వైన్ తాగడం వల్ల మంచే జరుగుతుంది.
జ్ఞాపక శక్తికి
రెడ్ వైన్‌లో ఉండే పాలీఫెనాల్స్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సరిగా నిద్రపోకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆ శక్తిని తగ్గకుండా కాపాడుతుంది రెడ్ వైన్.
మెరుగైన జీర్ణక్రియ
ముఖ్యంగా రెడ్ వైన్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇవి కడుపు సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. జీర్ణక్రియను మెరగుపరుస్తుంది.
కేవలం ఆల్కాహాల్ కలపని రెడ్ వైన్ ని మితంగా తాగితే మాత్రమే ఈ ప్రయోజనాలు కలుగుతాయని గర్తించాలి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం