ఏపీలో రెడ్ అలర్ట్ – భారీగా బలగాల మోహరింపు

కౌంటింగ్ రోజున ఏపీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ రోజున చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఏపీలోని సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.

అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు

ఎన్నడూ లేని విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. మారణాయుధాలు, నాటుబాంబుల కోసం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరి ఇళ్లలోనైనా మారణాయుధాలు ఉంటే ఇవ్వాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. హిస్టరీ షీట్స్ ఉన్న వారిని స్టేషన్ కు పిలిచి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. నేర చరిత్ర ఉన్న వారిని కౌంటింగ్ రోజున దూరంగా ఉంచాలని లేదంటే అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నివురు గప్పిన నిప్పులా పరిస్థఇతి

ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దిగినప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పర మోహరింపు కొనసాగుతూనేఉంది. దీంతో అనేక ప్రాంతాల్లో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నాడు పోలీస్‌శాఖ నిర్వహించిన కార్డన్‌ సెర్చ్‌లోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని 1,104 వాహనాలను జప్తు చేశారు. ఈ వాహనాలు ఎవరివన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అల్లర్లలో వేల మంది నిందితులు

ఎన్నికల రోజు, తదనంతరం జరిగిన దాడులకు సంబంధించి 2,790 మందిని గుర్తించారు. వీరిని ఇంకా పూర్తిస్థాయిలో అరెస్ట్‌ చేయలేదు. వీరిలో పలువురి ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. వీరి గురించి తెలిసిన వెంటనే అరెస్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది