కర్ణాటక పార్టీలకు రెబెల్స్ బెడద

కర్ణాటక పార్టీలకు రెబెల్స్ బెడద

రాజకీయాలంటే ఎన్నికలు. పోటీ చేసిన గెలవటాలు. పోటీకి వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ముందుకు సాగటాలు. అవకాశం రాకపోతే పార్టీ మారడాలు. ఆ అవకాశం కూడా లేకపోతే సొంత పార్టీకే ఎర్త్ పెట్టడాలు . అంటే రెబెల్ గా రంగంలోకి దిగి సొంత పార్టీ అభ్యర్థులనే ఇబ్బంది పెట్టడాలు. ఈ తంతు ప్రతీ ఎన్నికలో జరుగుతున్నదే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న కర్ణాటకలోనూ సేమ్ గేమ్..

మూడు పార్టీలకు టెన్షన్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. రెబెల్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవాలని పార్టీలు చేసిన విజ్ఞప్తులను చాలా మంది పట్టించుకోలేదు. దానితో పార్టీలు వారిని కన్విన్స్ చేయలేకపోయాయన్న చర్చ మొదలైంది. బీజేపీకి ఇప్పుడు 14 చోట్ల రెబెల్ అభ్యర్థులున్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 18 మంది రెబెల్స్, అఫిషియల్ అభ్యర్థులకు టెన్షన్ పుట్టిస్తున్నారు. మాండ్యా నియోజకవర్గంలో జేడీఎస్ కు ఒక రెబెల్ టెన్షన్ పెట్టిస్తున్నారు ఎందుకంటే మాండ్యా ఆ పార్టీకి కంచుకోట..

గెలుస్తామని ధీమా

కొంతమంది టికెట్ ఇవ్వలేదని అలిగి రెబెల్ గా రంగంలోకి దిగుతారు. కొందరు గెలుస్తామన్న ధైర్యంతో నామనేషన్ వేసేస్తారు. తర్వాత పంతాలకు పోయి ఉపసంహరించుకోరు.గాంధీనగర్ లో బీజేపీ రెబెల్ కృష్ణయ్య షెట్లీ పోటీ నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. తాను గెలుస్తానని సర్వేలో తేలిన తర్వాతే పోటీలో ఉన్నానని, అధిష్టానం టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని ఆయన ఆరోపించారు. బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ కారణంగానే తనకు టికెట్ రాలేదని ఆయన అంటున్నారు. పుత్తూరులో రెబెల్ అభ్యర్థి అరుణ్ కుమార్ పుత్తిలాను సమాధానపరిచే ప్రయత్నాలు విఫలమయ్యాయి. పులకేశినగర్ లలో ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తికి టికెటివ్వని కాంగ్రెస్ పార్టీ, ఆయన రెబెల్ పోటీ చేయకుండా మాత్రం ఆపలేకపోయింది. ఢిల్లీ పెద్దలు ఫోన్ చేసి చెప్పినా చిక్ పేటలో కేసీ బాబు విత్ డ్రా కాలేదు. కునిగల్, ముథోల్, సౌందట్టి, తారీకేరే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు గట్టి రెబెల్స్ ఉన్నారు. పార్టీ అభ్యర్తులను ఓడించే సత్తా వారికి ఉంది..

ఏడుగురిని సమాధానపరిచిన బీజేపీ

మాజీ మంత్రి ఈశ్వరప్పకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. ఆయన కాంగ్రెస్ లో చేరడం లేదా రెబెల్ గా పోటీ చేయడం లాంటి చర్యలకు దిగుతారని భావించారు. ప్రధాని మోదీ స్వయంగా ఈశ్వరప్పకు ఫోన్ చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అభినందించారు. సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. దానితో ఈశ్వరప్ప మెత్తబడ్డారు. పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని మోదీకి హామీ ఇచ్చారు.

బీజేపీ రాష్ట్ర శాఖ వ్యూహకర్తలు రంగంలోకి దిగి ఏడుగురు రెబెల్స్ ను సమాధానపరచ గలిగారు. రామదుర్గ నియోజకవర్గంలో నామినేషన వేసిన మహదేవప్ప యడవాడ్, షిరహట్టి బరిలోకి దిగిన రామప్ప లామానీ, కునిగల్ పోటీలోకి వచ్చిన రాజేష్ గౌడల లాంటి వారిని దారికి తీసుకొచ్చారు. తిరుగుబాటు బావుటా ఎగురవేసిన హావేరీ ఎమ్మెల్యే నెహారు ఒలేకర్ కూడా అధిష్టానం జోక్యంతో మెత్తబడ్డారు. మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి..