రవి ఉప్పల్ అరెస్టు – భాగెల్ కు బిగుస్తున్న ఉచ్చు..

అవినీతి,అక్రమాలు ఎవరు చేసిన చివరకు కటకటాల పాలు కావాల్సిందే.వారికి వత్తాసు పలికి కాసులకు కక్కుర్తి పడిన వాళ్లు సైతం జైలుకు వెళ్లాల్సిందే. అక్రమ సంపాదన ఎప్పటికైనా పామై కరిచే అవకాశం ఉంటుంది. ఛత్తీస్ గఢ్ లో జరగబోయేది కూడా అదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

దుబాయ్ నగరంలో రవి ఉప్పల్ అరెస్టు

మహదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు రవి ఉప్పల్ ను దుబాయ్ లో అరెస్టు చేశారు. అతడిపై రెడ్ కార్నర్ నోటీసు ఉండటంతో గత వారం అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలకు సమాచారం అందింది. త్వరలో ఈడీ అధికారులు దుబాయ్ వెళ్లి రవి ఉప్పల్ ను భారత్ తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభిస్తారని తెలుస్తోంది.
మనీ లాండరింగ్ కేసు పెట్టిన ఈడీ…

43 ఏళ్ల రవి ఉప్పల్ పై ఈడీ మనీ లాండరింగ్ కేసు పెట్టింది, అతనితో పాటు సౌరబ్ చక్రధర్ అనే వ్యక్తిపై కూడా పీఎంఎల్ఏ చట్టం కింద ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ కోర్టులో కేసు నమోదై విచారణలో ఉంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వహణలో వారికి చత్తీస్ గఢ్ పోలీసులు కూడా సహకరించినట్లు ఈడీ గుర్తించింది. ఈడీ అభ్యర్థన మేరకే ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో దుబాయ్ నగరంలో ఉన్న రవి ఉప్పల్ ను అరెస్టు చేయడం సాధ్యపడింది. అతనికి భారత పాస్ పోర్టుతో వనౌత్ దేశ పాస్ పోర్టు కూడా ఉన్నట్లు గుర్తించారు. భారత పౌరసత్వం వదులుకోకుండానే వనౌత్ పాస్ పోర్టు ఎలా పొందారన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.

భాగెల్ లింకు ఏమిటో…?

ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ కు మహదేవ్ యాప్ నిర్వాహకులకు లింకులున్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోనే ఎక్కువ కార్యకలాపాలు నిర్వహించిన మహదేవ్ యాప్ అక్కడ రూ.6,000 కోట్ల వరకు రాబటి పొందినట్లు చెబుతున్నారు. ఎవరూ అడ్డుపడకుండా ఉండేందుకు పోలీసు శాఖకు, అప్పటి ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అప్పజెప్పినట్లు ఈడీ గుర్తించింది. ఎన్నికల వ్యయం కోసం కాంగ్రెస్ పార్టీకి రవి ఉప్పల్ రూ.508 కోట్ల రుపాయల నగదు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అసీమ్ దాస్ అనే క్యాష్ కొరియర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దీనిపై దర్యాప్తు జరుగుతోందని ఈడీ వెల్లడించింది. అదీ ఎన్నికల ముందు ఈ ఏడాది నవంబరు మొదటి వారంలోనే కొంత డబ్బులు పట్టుబడటం కూడా అనుమానాలకు మరింత బలం చేకూర్చేదిగా మారింది.