ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారు మోగుతున్న పేరు అయోధ్య. అయితే అయోధ్య ఆలయం కన్నా 5 రెట్లు పెద్దదైనా రామాలయ నిర్మాణం జరుగుతోంది. ఎక్కడ? ఆ ఆలయం విశిష్టతలేంటి? చూద్దాం…
విరాట్ రామాయణ దేవాలయం
బీహార్, తూర్పు చంపారన్‌లోని కైత్వాలియాలో ప్రపంచంలోనే అతి పెద్ద రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయం అయోధ్య శ్రీరామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. దీని పేరు విరాట్ రామాయణ దేవాలయం. కైత్వాలియా గ్రామం సమీపంలో రహదారి పక్కన ఈ విరాట్ రామాయణ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రదేశం వైశాలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో, పాట్నా నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. మే 2023లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
405 అడుగుల ఎత్తు శిఖరం
కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ రూపకల్పన ఆధారంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయం అంగ్‌కోర్ వాట్ కంటే రెట్టింపు ఎత్తు, పరిమాణం ఉండేలా ప్లాన్ ఉంది. ప్రధాన శిఖరం అంగ్‌కోర్ వాట్ యొక్క 215 అడుగుల శిఖరం కంటే దాదాపు రెట్టింపు ఉంటుంది. అంటే 405 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది పూర్తయినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన నిర్మాణం అవుతుంది. మొత్తం నిర్మాణానికి దాదాపు 4 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ దేవాలయాల సమూహంలో మొత్తం 18 దేవతలకు 18 గర్భాలయాలు ఉంటాయి…వీటిలో ప్రధాన దేవుడు శ్రీరాముడు.
మహావీర్ టెంపుల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్
తిహారి (తూర్పు చంపారన్)లోని కైత్వాలియాలో నిర్మించే విరాట్ రామాయణ దేవాలయ ప్లాన్ 2012లో ప్రారంభమైంది. ఇది పాట్నాలోని మహావీర్ టెంపుల్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఈ విరాట్ రామాయణ ఆలయంలో 33 అడుగుల ఎత్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించే యోచనలో ఉన్నారు. నవంబర్ 13, 2013న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఆలయ భవిష్యత్తు నమూనాను ఆవిష్కరించారు.
ఆలయ విశిష్టతలివే!
కొత్తగా నిర్మిస్తోన్న ఈ రామాలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం కాబోతోంది .ఆలయ నిర్మాణ ప్రణాళిక ప్రకారం,…125 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటుంది..ఇంకా 200 ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆలయ వైశాల్యం 3.67 లక్షల చదరపు అడుగులు. ఈ భారీ రామాయణ దేవాలయం పొడవు 1080 అడుగులు, వెడల్పు 540 అడుగులు. ఈ ఆలయంలో 108 అడుగుల ఎత్తులో ఐదు శిఖరాలు ఉంటాయి. ఈ దేవాలయం ఎత్తైన శిఖరం 405 అడుగులు ఉంటుంది. అలాగే 180 అడుగుల ఎత్తులో నాలుగు శిఖరాలు ఉంటాయి. ఈ ప్రధాన ఆలయం ముందు, 20,000 మంది సామర్థ్యంతో భారీ ప్రార్థనా మందిరం కూడా ఉంటుంది.
ఎప్పటికి పూర్తవుతుంది!
ఆలయం పూర్తిగా నిర్మించిన తర్వాత అయోధ్య నుంచి జనక్‌పూర్ వైపు వెళ్లేటప్పుడు ఈ ఆలయం కనిపిస్తుంది. ప్రస్తుతం దీని నిర్మాణం వేగంగా జరుగుతోంది. 2025 చివరి నెల నాటికి ఆలయం సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.