రామాలయం – తప్పులో కాలేసిన కాంగ్రెస్ అధిష్టానం..

ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది మరోదారి అని అంటుంటారు. కాంగ్రెస్ పార్టీ తీరు కూడా అలాగే ఉంది. దేశమంతా ఒకటై వేడుకలు జరుపుకుంటున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. జనవరి 22న అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉండగా తాము హాజరు కాబోవడం లేదని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పెద్దలు ప్రకటించారు.

జైరాం రమేష్ ప్రకటన

రామ మందిర ప్రారంభోత్సవానికి తాము రాలేమని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ఆ పార్టీ నేత అధీర్‌ రంజన్‌ స్పష్టం చేశారు. రామ మందిర ప్రారంభానికి రావల్సిందిగా సోనియా, ఖర్గే, అధీర్‌ రంజన్‌లకు గత నెలలో ఆహ్వానాలు అందాయని, అయితే ఈ ఆహ్వానాలను వారు గౌరవపూర్వకంగా తిరస్కరించారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. శ్రీరాముడిని దేశంలో లక్షలాది మంది పూజిస్తారని, మతం అనేది వ్యక్తిగత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. కానీ బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ రామ మందిరాన్ని ఎప్పుడో ఒక రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయన్నారు. మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉండగానే బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ ఎన్నికల్లో ప్రయోజనాల కోసం దాన్ని ప్రారంభిస్తున్నాయని ఆరోపించారు. నిజానికి అయోధ్య రావడానికి కాంగ్రెస్ వెనుకాడుతోందన్న అభిప్రాయం ఉంది. మోదీ పరపతి మరింతగా పెరిగిపోతోందన్న భయంతో ఆ పార్టీ కుంటిసాకులు చెప్పి దూరంగా ఉంటోంది. దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్న ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయడం ద్వారా తానే రాజకీయాలు చేస్తోందని నిరూపించింది.

అధిష్టానం నిర్ణయం గుజరాత్ కాంగ్రెస్ అభ్యంతరం

సోనియా గ్రూపు నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గుజరాత్ కాంగ్రెస్ నేత ఒకరు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. శ్రీ రామజన్మభూమి ట్రస్ట్ పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించి ఉండాల్సింది కాదని అర్జున్ మోధ్వాడియా అనే నాయకుడు అభిప్రాయపడ్డారు. ఆలయం 150 కోట్ల మంది భారతీయుల మనోభావాలకు చిహ్నమని, అలాంటి అంశాల్లో రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం తగదని మోధ్వాడియా అభిప్రాయపడ్డారు. ఆయన అభిప్రాయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి…

కర్ణాటకలోనూ సంబరాలు ప్రారంభం

కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ కూడా రామాలయ ప్రారంభానికి శూచకంగా రాష్ట్రమంతా వేడుకలు జరుపుతున్నారు. మనమందరం హిందువులం అంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. “నేను హిందువును, రామ భక్తుడిని, హనుమంతుడి భక్తుడిని, మన హృదయాంతరాలలోంచి రామ భక్తి పొంగుకు వస్తుంది..” అని శివకుమార్ ప్రకటించారు. కర్ణాటకలోని అనేక ఆలాయాల్లో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు. ఇంతకీ శివకుమార్ కు అర్థమైన విషయం సోనియాకు ఎందుకు అర్థం కాలేదన్నదే పెద్ద ప్రశ్న