తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రాజేష్ – అసంతృప్తి వ్యక్తం చేసిన ఆదిమూలంకు జగన్ చెక్ !

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ పరిణామాలు ఊపందుకుంటున్నాయి. సత్యవేడు ఎంఎల్‌ఎ ఆదిమూలంకు సీఎం జగన్ చెక్ పెట్టారు. ప్రభుత్వం, పార్టీకి నష్టం కలిగేలా విమర్శలు చేయడంతో ఆయనకు ప్రకటించిన తిరుపతి ఎంపీ టిక్కెట్ కు వేరే అభ్యర్థిని ఖరారు చేస్తున్నారు.

కష్టపడినా సీటు ఎగ్గొట్టారని ఆదిమూలం ఆరోపణ

చిత్తూరు జిల్లాలో ఎవరూ చేయని విధంగా అధిష్టానం ఆదేశాల మేరకు 600 రోజుల పాటు గడప గడప కార్యక్రమం నిర్వహించి ప్రజలకు చేరువయ్యానని, మంత్రి పెద్దిరెడ్డి జోక్యంచేసుకుని తనకు సీటు బదలాయింపు చేశారని తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ జరిపిన సర్వేలో ఆదిమూలంకు గెలిచే పరిస్థితి లేదని నివేదిక రావడంతో తిరుపతి ఎంపి అభ్యర్థిగా బదిలీ చేశారు. తనపై నియోజకవర్గంలో వ్యతిరేకత లేనప్పటికీ కావాలనే గురుమూర్తికి అవకాశం కల్పించడానికి తనను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఈ విషయమై మీడియా ఎదుట ఆదిమూలం వాపోయారు.

ఆదిమూలంకు వెంటనే చెక్ పెట్టిన పెద్దిరెడ్డి

పెద్దిరెడ్డి సీరియస్‌ అయ్యారు. తిరుపతి ఎంపి అభ్యర్థిగా ఆదిమూలంను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రకటించినప్పటికీ, మంత్రిపై విమర్శలు చేయడంతో రాజకీయంగా ఆదిమూలంకు చెక్‌పెట్టారు. జీడీనెల్లూరు టిక్కెట్‌ ఆశిస్తున్న మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ చెల్లెలి కొడుకు రాజేష్‌కు సీటు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రాజేష్‌ను మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం రాత్రి ఇంటికి పిలిపించి తిరుపతి ఎంపి అభ్యర్థిగా పోటీ చేయాలని అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు రాజేష్‌ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో తిరుపతి వైసిపి ఎంపి అభ్యర్థిగా రాజేష్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఆదిమూలంకు అటు ఎంఎల్‌ఎగానూ, ఎంపిగానూ రెండు అవకాశాలను కోల్పోయారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే చిత్తూరు టిక్కెట్లు

మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే.. చిత్తూరు జిల్లాలో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ధిక్కరించిన వారిని ఆయన ఊరుకోవడం లేదు. మూడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చేస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. పూతలపట్టు ఎమ్మెల్యే బాబుకు చెక్ పెట్టారు. జీడీనెల్లూరు ఎమ్మెల్యే ఆదిమూలం రెండు అవకాశాలు కోల్పోయారు. ఆదిమూలం రెబల్ గా మారడంతో… కుతూహలమ్మ కుటుంబానికి అవకాశం లభిస్తోంది.