క్వారీ టెండర్లు – బీజేపీపై డీఎంకే దౌర్జన్యం

క్వారీ టెండర్లు – బీజేపీపై డీఎంకే దౌర్జన్యం

తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలు ఇష్టానుసారం వ్యవహరిస్తాయని, దౌర్జన్యం చేస్తాయని దశాబ్దాలుగా వినిపిస్తున్న మాటే. పోలీసు స్టేషన్లతో సంబంధం లేకుండా వాళ్లే పంచాయతీలు నిర్వహించడం, ప్రతీ పనికి ఒక రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడటం జరుగుతూనే ఉంది. అడ్డు వస్తే అధికారులు, పోలీసులపై కూడా వాళ్లు దాడులు చేసేస్తారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది…

మైనింగ్ శాఖ కార్యాలయంలోనే దాడి…

డీఎంకే అధినేత స్టాలిన్ ఎన్ని సుద్దులు చెప్పినా ఆయన తమ పార్టీ నేతల దౌర్జన్యాన్ని మాత్రం కట్టడి చేయడం లేదు. రాజకీయ ప్రత్యర్థులపైనా, జనం మీద దాడులకు ఆయన పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణలు ప్రత్యర్థులు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా దక్షిణ తమిళనాడులోని పెరంబలూరు నగరంలో ఉండే మైనింగ్, జియాలజీ శాఖ కార్యాలయంలో డీఎంకే కార్యకర్తలు రౌడీయిజాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర రవాణా మంత్రి శివశంకర్, పెరంబలూరు ఎమ్మెల్యే ప్రభాకరన్ అనుచరులైన 500 మంది అక్కడకు చేరుకుని బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడి చేశారు.

టెండర్లు వేయకుండా అడ్డుకునేందుకు..

అసలు విషయానికి వెళితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండే మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో 31 క్వారీలకు టెండర్లను ఆహ్వానించారు. తాము కూడా టెండర్లు వేయాలని బీజేపీ వ్యాపారుల సంఘం ప్రతినిధులు మైనింగ్ కార్యాలయానికి వచ్చారు. అంతే 500 మంది డీఎంకే కార్యకర్తలు వాళ్ల మీద పడి కొట్టారు. టెండర్ దరఖాస్తు ఫారాలని లాక్కొని చించి పడేశారు. టెండర్ల సమర్పణకు ఆఖరి రోజున అందరినీ అడ్డుకుంటే తమకే దక్కుతుందన్న నమ్మకంతో వాళ్లు బీజేపీ వారిపై దాడులు చేశారు. కళైసెల్వన్, మురుగేశన్ అనే బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పైగా గుంపు అధికారులు, పోలీసులతో కూడా తలపడింది. అధికారులు చెబుతున్నది వినిపించుకోకుండా దాడులు చేసింది.

టెండర్ రద్దు చేసిన కలెక్టర్

గొడవలు వద్దంటూ అడ్డుపడిన అధికారులపై కూడా డీఎంకే గూండాలు దాడి చేశారు. గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పీ.జయపాల్, అసిస్టెంట్ జియాలజీ ఆఫీసర్ ఇళంగోవన్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కుమరీ ఆనందన్ కు దెబ్బలు తగలడమే కాకుండా చొక్కాలు చినిగాయి. దీనితో ప్రత్యేక పోలీసు దళాలతో అక్కడకు వచ్చిన జిల్లా ఎస్పీ శ్యామలా దేవీ జనాన్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు.దుండగులు ఆఫీసు ఫర్నీచర్ తో పాటు సీసీ కెమెరాలను కూడా పగులగొట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ శ్యామలా దేవీ హెచ్చరించారు. అధికారికంగా ఫిర్యాదు అందుకున్న తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మరో పక్క దౌర్జన్యం జరిగిన వ్యవహారంపై ప్రాధమిక నివేదక తెప్పించుకున్న జిల్లా కలెక్టర్.. మొత్తం టెండర్ ప్రక్రియను రద్దు చేశారు. ఏదేమైనా డీఎంకే దౌర్జన్యంపై తమిళనాడు వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారానికి వచ్చినప్పటి నుంచి డీఎంకే వాళ్లు ఏదోక విధంగా జనాన్ని బెదరగొడుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి సీఎం స్టాలిన్ ఇవన్నీ చూస్తున్నారో లేదో….