మోదీ విజయాన్ని కాంక్షించిన పుతిన్

వాడ్లిమిర్ పుతిన్ – కొందరికి ప్రజాస్వామ్యవాది,కొందరికి నియంత. సహేతుకంగా ఆలోచించే ఆయన మనస్తత్వమే దేశాధినేతలను పుతిన్ దగ్గరకు చేర్చుతుంది. అవతలివారి పరపతి, పరిస్థితి, జనాదరణ, మేటి చర్యలను అంచనా వేసి మరీ పుతిన్ మాట్లాడతారు. ఎంత కఠినంగా ఉన్నట్లు కనిపిస్తారో, అంతటి మృదుస్వభావి అని కూడా పుతిన్ కు పేరుంది. భారత్ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అంటే ఆయనకు తీరని అభిమానం. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన మోదీ చర్యలను ప్రశంసిస్తుంటారు…

పుతిన్ తో విదేశాంగమంత్రి భేటీ…

భారత విదేశాంగమంత్రి సుబ్రమణ్యం జయశంకర్ ఇప్పుడు రష్యా పర్యటనలో ఉన్నారు. పనిలో పనిగా ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు మోదీ చొరవను, గొప్పదనాన్ని పుతిన్ ప్రశంసించారు. వచ్చే ఏడాది భారత్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని పుతిన్ స్వయంగా గుర్తు చేశారు. అక్కడ మా మిత్రులు ఘనవిజయం సాధిస్తారని విశ్వసిస్తున్నానని అంటూ నర్మగ్భంగా మోదీ విజయం కోసం ఎదురుచూస్తున్నానన్నారు. మా మిత్రుడికి అన్ని విధాలా విజయం చేకూరాలని ఆశిస్తున్నానన్నారు. భారత్ లో రాజకీయ శక్తుల పునరేకీకరణ ఎలా ఉన్నా తమ మిత్రడి విజయం ఖాయమని పుతిన్ అంచనా వేశారు..

ఉక్రెయిన్ పై భారత వైఖరికి ప్రశంసలు

మోదీ త్వరలో రష్యా పర్యటనకు రావాలని పుతిన్ ఆహ్వానించారు. భారత తటస్థ వైఖరి పట్ల తన గౌరవ భావాన్ని ప్రదర్శించారు. చర్చల ద్వారా రష్యా – ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కావాలని మోదీ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. యుద్ధం పరిష్కారం కాదని మోదీ స్వయంగా పుతిన్ వద్ద ప్రస్తావించిన సందర్భం ఉంది. రష్యా వ్యతిరేకంగా జట్టు కట్టాలన్న ఐరోపా దేశాల ప్రయత్నాలను కూడా భారత్ తిరస్కరించింది. ఏదైనా సరే చర్చలే శరణ్యమని ప్రకటించింది.

పురోగామి దిశలో స్నేహ సంబంధాలు..

ప్రపంచం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కొంటున్నా భారత్ – రష్యా సంబంధాలు పురోగామి దిశలోనే సాగుతున్నాయని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఇచ్చిపుచ్చుకునే ధరోణిలో ఇరు దేశాలు స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రపంచ దేశాలు తమపై వత్తిడి పెట్టినా ఇండియా మాత్రం అండగా ఉందన్న అభిప్రాయాన్ని పుతిన్ నర్మగర్భంగా వెలిబుచ్చారు. నిజానికి ఉక్రెయిన్ విషయంలో తటస్థ వైఖరి ద్వారా ఇరు వర్గాల నుంచి భారత్ స్నేహాన్ని అందుకోవడమే కాకుండా వాణిజ్య, వర్తక పరంగా ప్రయోజనం పొందింది. చమురు సరఫరా సహా ఆహార ఉత్పత్తి రంగంలో ముందడుగు వేయగలిగింది. భారత వర్తకానికి ఇబ్బంది లేకుండా చూసుకోగలిగింది. ఇదీ మోదీ చాణిక్యానికి, జయశంకర్ దౌత్యనీతికి నిదర్శనమని విశ్వసిస్తున్నారు…