కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించిన సునీల్ టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకడిగా వెలిగాడు. అందాలరాముడు సినిమాతో హీరోగా మారి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అప్పటి నుంచి హీరోగా వరుస ప్రాజెక్టులలో నటించినా అవేమీ ఆశించినంత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. అటు హీరోగా కంటిన్యూ కాలేక..మళ్లీ వెనకడుగు వేయలేక ఇబ్బందిపడ్డాడు. దీంతో మళ్లీ రూటు మార్చిన సునీల్ విలక్షణ నటుడిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేశాడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు.
‘పుష్ప’ తర్వాత మారిన రూట్
పుష్పలో పాత్ర కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సునీల్ కూడా బాగా పాపులర్ అయ్యారు. దీంతో తెలుగు సినిమాలతో పాటూ తమిళ ప్రాజెక్టులలోనూ వరుస అవకాశాలొస్తున్నాయి. రజనీకాంత్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ జైలర్ సినిమాలో నటించిన సునీల్..తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన మహావీరుడులోనూ ముఖ్య పాత్ర పోషించాడు. తాజాగా విశాల్ మార్క్ ఆంటోనీలోనూ మెరిసాడు. ఇంకా చెప్పుకోవాలంటే తెలుగులో కన్నా తమిళంలోనే వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. యాక్టింగ్ పరంగానే కాకుండా, లుక్స్ విషయంలోనూ వేరియేషన్ చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. జైలర్, మావీరన్, మార్క్ ఆంటోని చిత్రాలు చూస్తే ఈ విషయం పక్కాగా అర్థమవుతుంది.
‘పుష్ప 2’ రేంజ్ పెరుగుతుందా!
ఇక పుష్ప 2 విడుదలైతే ఆ క్రేజ్ మరింత పెరగడం పక్కా. వచ్చే ఏడాది ఆగస్టులో పుష్ప 2 విడుదల కానుంది. ఈ మూవీలో సునీల్ క్యారెక్టర్ కి మంచి పేరొస్తే ఇక సునీల్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఖాయం. ప్రస్తుతం తెలుగు సినిమాలలో రోజుకు 30 వేలు తీసుకుంటున్న సునీల్..తమిళంలో రోజుకు 60 వేల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం సునీల్ సినిమాల విషయానికొస్తే..కార్తి ‘జపాన్’, అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ‘ఈగాయ్’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, మహేశ్ బాబు ‘గుంటూరు కారం’లో నటిస్తున్నాడు. ఇవన్నీ భారీ ప్రాజెక్టులే..ఇవి సక్సెస్ అయితే సునీల్ రేంజ్ మరింత పెరగడం ఖాయం…