పూరీ జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది (2023) జూన్ 20న ప్రారంభమవుతుంది. రథయాత్రలో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆషాఢ మాసం ప్రారంభమైన రెండో రోజు అంటే విదియ రోజు జగన్నాథుడు, తన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రతో కలసి గర్భగుడి నుంచి జనం మధ్యకు వస్తాడు. జగన్నాథ రథయాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
గర్భగుడిలోంచి బయటకు వచ్చే దేవుళ్లు
జగన్నాథ రథయాత్ర ఆషాడమాసంలో విదియతో మొదలై దశమి రోజున ముగుస్తుంది. సాధారణంగా దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో జగన్నాథ పాదయాత్ర జరుగుతుంది. రథయాత్రలో మొదట తాళ ధ్వజ రథంపై బలరాముడు ఉంటారు. జగన్నాథుని సోదరి సుభద్ర పద్మ ధ్వజ రథంపై, జగన్నాథుడు గరుడ పతాకంపై ఉంటారు. రథం తయారు చేయడానికి మూడు రకాల పవిత్రమైన చెక్కలను ఉపయోగిస్తారు. దేవుని రథానికి 16 చక్రాలు ఉంటాయి.
ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణంలాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకి వాడతారు. కానీ పూరీలో అలాకాదు! సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలు తయారుచేస్తారు. వీటి తయారీని అక్షయతృతీయ రోజున మొదలుపెడతారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అనీ బలభద్రుని కోసం తయారుచేసే రథాన్ని తాళధ్వజం అనీ సుభద్ర కోసం తయారుచేసే రథాన్ని దేవదాలన అనీ పిలుస్తారు.
రథాల వివరాలివే!
పూరీ జగన్నాథ రథం ఎత్తు – 45 చదరపు అడుగులు, వైశాల్యం – 35 చదరపు అడుగులు
సోదరుడు బలరాముడు రథం – 65 అడుగుల పొడవు , 64 అడుగుల వెడల్పు , ఎత్తు 45 అడుగుల
బలభద్రుడు రథం సుభద్ర , జగన్నాథుని రథంకన్నా చిన్నది.
9 రోజుల పాటు గుండిచా ఆలయంలోనే
సాధారమంగా రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి. కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు. జగన్నాథుడికి గుండిచా అనే పిన్నిగారు ఉన్నారు. ఆవిడ ఉండే గుడి పూరీ ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుడు ఓ తొమ్మిదిరోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు. తిరిగి ఆషాఢమాసంలోని పదోరోజున పూరీ గుడికి చేరుకుంటాడు. జగన్నాథుడు గుండిచా ఆలయం నుంచి తిరిగివచ్చే యాత్రని ‘బహుద యాత్ర’ అంటారు. ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ ‘మౌసీ మా’ అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయల్దేరతాయి.
జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత ‘సునా బేషా’ అనే ఉత్సవం జరుగుతుంది. అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతురన్నమాట! దీనికోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం