ఏపీ బీజేపీలో నేటి నుంచి పురందేశ్వరి నాయకత్వం – బయట శక్తులను ఎదుర్కోవడమే కీలకం !

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నేటి నుంచి పురందేశ్వరి నాయకత్వం ప్రారంభమయింది. ఆమె అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ… మొదటి నుంచి ఢిల్లీ రాజకీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా పదేళ్లు ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినా రాష్ట్ర రాజకీయాల్లోకి రాలేదు. తర్వాత బీజేపీ లో కూడా ఆమె జాతీయనాయకురాలిగానే వ్యవహరించారు. రాష్ట్ర రాజకీయాల్లో కి రాలేదు. కానీ ఇప్పుడు నేరుగా ఆమెకు నాయకత్వ బాధ్యతలు ఇచ్చారు. ఆమె బీజేపీని బలోపేతం చేయడానికి .. బయట శక్తులను ఎదుర్కోవడమే కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీని బయట నుంచి నియంత్రించాలనుకునేవారే ఎక్కువ !

ఏపీ భారతీయ జనతా పార్టీని బయట నుంచి నియంత్రించాలనుకునేవారు ఎక్కువగా ఉన్నారు. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు.. ఢిల్లీలో బీజేపీకి మద్దతుగా ఉన్నట్లుగా కనిపిస్తూ.. రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకుండా చేస్తూ ఉంటారు. రెండు పార్టీలు.. బలమైన వాయిస్ వినిపించే యువనేతల్ని వీలైనంత వరకూ తొక్కేసే ప్రయత్నం చేస్తారు. ఇందు కోసం తప్పుడు ప్రచారాలు చేస్తారు. ఆయా పార్టీలకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ఈ ప్రచారాలు విస్తృతంగా చేసి… తమకు వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించి.. బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకునేవారు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వారి కుట్రపై పురందేశ్వరి ఓ కన్నేసి ఉంచాల్సి ఉందని.. ఇటీవలి కాలంలో బీజేపీ పరిణామాలను విశ్లేషిస్తున్న వారు అంటున్నారు.

బీజేపీలో చురుకైన యువనేతలపై ఇప్పటికే వ్యతిరేక ప్రచారం

బీజేపీలో చురుకుగా ఉండే యువనేతలను సైలెంట్ చేయడానికి వ్యూహాత్మకంగా ఇప్పటికే ఇతర పార్టీలు.. తమ అనుకూల మీడియా ద్వారా వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. సొంత నియోజకవర్గాల్లో పట్టు ఉండదని.. మీడియాలోనే కనిపిస్తారంటూ.. .. కొంత మందిని టార్గెట్ చేసుకుంటున్నారు. వారి లక్ష్యం బలమైన వాయిస్ వినిపించేవారిని దూరం పెట్టేలా చేయాలన్న వ్యూహమే. నిజానికి బీజేపీలో ఎవరైనా బలమైన నేత ఉంటే.. వారిని … బీజేపీలో ఎందుకు అంటూ.. పక్క పార్టీలకు తరలిచే ప్రక్రియలను ఈ మీడియాలే చేస్తాయి.కన్నా లక్ష్మినారాయణ సలహా పలువురు కీలక నేతల విషయంలో అదే చేశారు. ఇప్పుడు ఇతర నేతలపై దృష్టి పెడుతున్నారు.

బయటశక్తుల ప్రభావానికి లోనుకాకపోతే బీజేపీకి తిరుగు ఉండదు !

పురందేశ్వరి … ఏపీ బీజేపీకి అధ్యక్షురాలు కావడాన్ని ఇప్పటికి ఏపీ బీజేపీలోని అన్ని వర్గాలు స్వాగతించాయి. సామర్థ్యాన్ని నిరూపించుకున్న మహిళా నేత ఆధ్వర్యంలో మరింత శక్తివంతంగా పని చేయడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. కష్టపడే వారిని గుర్తించి … బీజేపీ బలమైన వాయిస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే వారికి ప్రాధాన్యం కల్పించి … ముందుకు వెళ్తారని క్యాడర్ ఆశిస్తున్నారు. అలా కాకుండా.. పార్టీలో కొంత మంది వర్గాలను ప్రోత్సహిస్తే… బీజేపీకి కూడా ఇబ్బందేనని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.