ప.గో జిల్లాలో టీడీపీలో నిరసన సెగలు – రెబల్సె బెడద తప్పదా ?

జనసేనకు కేటాయిం చిన స్థానాల్లో టిడిపి టిక్కెట్‌ ఆశించిన అభ్యర్థులను చంద్రబాబు బుజ్జగించే ప్రక్రియ చేపట్టారు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు టిడిపి నాయకత్వం పని చేయాలని శుక్రవారం దిశానిర్దేశం చేశారు. దీంతో పొత్తులో ఏలూరు జిల్లాలో జనసేనకు కేటాయించిన స్థానాలపై కొంత స్పష్టత వచ్చింది.

ఎక్కువ సీట్లు ప.గో జిల్లాలో

జనసేనకు ఉంగుటూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం, పోలవరం, భీమవరం స్థానాలను కేటాయించినట్లు ప్రచారం సాగుతోంది. ఉంగుటూరు టిక్కెట్‌ జనసేనకు కేటాయించినట్లు తెలియడంతో టిడిపి టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎంఎల్‌ఎ గన్ని వీరాంజనేయులు గురువారం తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పెద్దఎత్తున హడావుడి చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అసంతృప్తి జ్వాలలు రేగుతుండటంతో టిడిపి అధినేత చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. సీటు దక్కని అసంతృప్త నేతలను బుజ్జిగించే పని చేపట్టారు.

నేతలతో స్వయంగా మాట్లాడుతున్న చంద్రబాబు

అందులో భాగంగా ఉంగుటూరు టిక్కెట్‌ ఆశించిన గన్ని వీరాంజనేయులు, నరసాపురం టిక్కెట్‌ ఆశిస్తున్న పొత్తూరి రామరాజు, పోలవరం టిక్కెట్‌ రేసులో ఉన్న బొరగం శ్రీనివాస్‌, తాడేపల్లిగూడెం టిక్కెట్‌ ఆశిస్తున్న వలవల బాబ్జీతో చంద్రబాబు నేరుగా మాట్లాడారు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాల్లో మీరంతా సహకరించాలని కోరారు. పార్టీ అధికారంలోకొచ్చాక అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలో ఏయే స్థానాలు జనసేనకు కేటాయించారో అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ చంద్రబాబు సమావేశంతో స్పష్టత వచ్చింది.

కొన్ని చోట్ల టీడీపీ నేతలే జనసేనలో చేరి పోటీ చేసే చాన్స్

భీమవరం స్థానంలోనూ జనసేన పోటీ చేయనున్నట్లు ఇప్పటికే స్పష్టత వచ్చింది. మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరి భీమవరం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన జనసేన సభకు ఆయన హాజరు కావడం అందుకు మరింత ఊతమిచ్చింది. పొత్తులో భాగంగా టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు మున్ముందు ఏవిధంగా సహకరించుకుంటారో వేచిచూడాలి.