అడ్డంగా బుక్కయిన ప్రియాంకాగాంధీ భర్త …

సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ ప్రేమించి పెళ్లి చేసుకున్న రాబర్ట్ వాధ్రాపై అనేక ఆరోపణలున్నాయి. గాంధీ కుటుంబ పరపతిని అడ్డం పెట్టుకుని ఆయన వేల కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడ్డారని కేసులు కూడా నమోదయ్యాయి. మనీ లాండరింగ్, రియల్ ఎస్టేట్ లావాదేవలకు సంబంధించి వాధ్రా సంగతి తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా రోజుల క్రితమే కంకణం కట్టుకున్నాయి. తాజాగా మరోసారి ఈడీ ఆయనపై దృష్టి సారించి ప్రత్యేక ప్రకటన చేసింది..

నేర సంపాదనతో లండన్ ఆస్తులు

వాధ్రా వ్యాపారంలో ఓ మధ్యవర్తి ఉన్నాడు. అతని పేరు సంజయ్ భండారీ. అతని వద్ద లండన్ ఇల్లు పొందిన రాబర్ట్ వాధ్రా..దాన్ని మరమ్మత్తు చేయించి కొన్ని రోజులు అందులో ఉన్నారని ఎన్ ఫోర్మమెంట్ డైరెక్టర్ తన దర్యాప్తు ఆధారంగా ఇప్పుడో ప్రకటన విడుదల చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విదేశీ లావాదేవీలకు సంబంధించి రాబర్ట్ వాధ్రా పేరును ప్రస్తావించడం కూడా ఇదే మొదటి సారి. ఈ క్రమంలో చరువత్తూర్ చాకుట్టి తంపి అలియాస్ సీసీతో పాటు సుమిత్ ఛద్దాపై ఈడీ తాజా చార్జ్ షీటు దాఖలు చేసింది. తంపి, ఎమిరేట్స్ దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త కాగా, సుమిత్ ఛద్దా, యూకే పౌరుడు .

అక్రమ మార్గాల్లో ఆస్తుల సంపాదన

వాధ్రాకు అత్యంత సన్నిహితుడైన సంజయ్ భండారీ విదేశాల్లో విపరీతంగా అక్రమ ఆస్తులు సంపాదించాడు. లండన్లోని 12 బైరాన్స్టన్ స్క్వేర్, అక్కడ 6 గ్రాస్ వీనర్ హిల్ కోర్టులో అతనికి ఇళ్లున్నాయి. అందులో బైరాన్స్టన్ స్క్వేర్ ఇంటిని రాబర్ట్ వాధ్రాకు ఇవ్వగా దాన్ని ఆయన మరమ్మతు చేయించి చాలా రోజులు అందులో ఉన్నారని ఈడీ గుర్తించింది. భండారీతో పాటు తంపి, ఛద్దా … పీఎంఎల్ఏ చట్టాన్ని ఉల్లంఘించి వందల కోట్లు కూడబెట్టారు.దీనికి సంబంధించిన తంపిని ఈడీ 2020లో అరెస్టు చేయగా తర్వాత ఆయన బెయిల్ పొందాడు. తంపి కూడా వాధ్రాకు అత్యంత సన్నిహిత వ్యాపారవేత్తేనని ఈడీ గుర్తించింది.

ఛార్జ్ షీటు ఆధారంగా సమన్లు

ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జ్ షీటు ఆధారంగా తంపి, ఛద్దాలకు సమన్లు వెళ్లాయి. రాబర్ట్ వాధ్రాకు వారికి మధ్య మరికొన్ని ఆర్థిక లావాదేవీలను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వాధ్రా, తంపి కలిసి ఫరీదాబాద్ లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతుండగానే సమన్లు జారీ చేసినా హాజరు కాకుండా తప్పించుకుంటున్న ఛద్దాపై ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బ్లాక్ మనీ వ్యతిరేక చట్టాల క్రింద భండారీపై 2017 నుంచి కేసులున్నాయి. అవి త్వరలో ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు.మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీ కోర్టులో జనవరి 29న విచారణ జరుగుతుంది. అప్పుడు వాధ్రా వ్యవహారంలో ఈడీ ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి..