ప్రచార పటాటోపం, ప్రకటనల ఆర్భాటం మినహా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవడం, కార్యకర్తలతో కలిసి పనిచేయడం తెలియని కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. కాకపోతే తప్పును వేరే వారి మీదకు నెట్టి సోనియా కుటుంబాన్ని అపవాదు నుంచి కాపాడేందుకు పార్టీలో కొంత మంది నిత్యం పనిచేస్తుంటారు. సోనియా, రాహుల్, ప్రియాంక అడుగలకు మడుగులొత్తుతూ వారి కంట్లో పడేందుకు ప్రయత్నించే నేతలతోనే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిసినప్పటికీ ఆ పార్టీ తీరు మారదు..
యూపీ బాధ్యతల నుంచి దూరం… !
ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు చూస్తున్న ప్రియాంకాగాంధీ త్వరలో ఆ పదవి నుంచి తప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేసేందుకు వీలుగా ఆమె యూపీకి దూరం జరగబోతున్నారని పార్టీలో కొందరు చెబుతున్నారు. కాకపోతే అసలు సంగతి మాత్రం వేరే ఉంది. యూపీలో పార్టీ ఘోరపరాజయం తర్వాత అందులో ప్రియాంక చేతగానితనం కూడా ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.దాని నుంచి జనం దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రియాంకను యూపీకి దూరంగా ఉంటాలనుకుంటున్నారు. దానికి ఇతర రాష్ట్రాల ఎన్నికలను అడ్డుపెట్టుకుంటున్నారు.
యూపీ వైపు చూడని ప్రియాంక
2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పాతాళానికి నెట్టేశాయి. కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు, రాంపూర్ ఖాస్, పేఫన్నాలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, స్టార్ క్యాంపైనర్ గా ఉన్న ప్రియాంక ఆ తర్వాత యూపీ వైపు కన్నెత్తి చూడలేదు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 2.37 శాతం ఓట్లు రావడంతో ప్రియాంక నాయకత్వం, ఆమె ప్రచారం వల్ల ఒరిగిందేమీ లేదని సగటు కార్యకర్తలు కూడా చెప్పుకున్నారు. అంతకముందు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి 6.25 శాతం ఓట్లు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల ముందే ప్రియాంక ప్రధాన కార్యదర్శిగా తూర్పు యూపీ ఇంఛార్జ్ అయ్యారు. తర్వాతే మొత్తం యూపీ ఆమె చేతిలోకి వచ్చింది. పార్టీ కేవలం ఒక ఎంపీ సీటుకే పరిమితమైంది.
ప్రియాంక తర్వాత ఏవరు.. ?
ప్రియాంకాగాంధీ, యూపీ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటే ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారన్న చర్చ ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తారిఖ్ అన్వర్ లో ఒకరిని యూపీ ఇంఛార్జ్ గా నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. యూపీలోని ఉత్తరాఖండ్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు హరీష్ రావత్ కు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేషాలు వేసినా యూపీలో పాచికలు పారవన్నది నిజం. వరుసగా రండో సారి యూపీ సీఎంగా సేవలందిస్తున్న యోగీ ఆదిత్యనాథ్.. తన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. శాంతి భద్రతల స్థాపనలో యూపీ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబడింది. పారిశ్రామిక ప్రగతిలో పరుగులు తీస్తోంది. మోదీ నాయకత్వంపై యూపీ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసిలో అభివృద్ధి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందుకే ప్రియాంక కాంగ్రెస్ ఇంఛార్జ్ గా ఉన్నా.. లేకపోయినా యూపీ ప్రజలకు వచ్చే తేడా ఏమీ ఉండదు…