ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని .. ముఖ్యంగా ప్రధానమంత్రి ప్రత్యేక శ్రద్ద పెట్టారని ఏపీ కోసం ప్రత్యేకంగా ఇస్తున్న నిధుల కేటాయింపుల అంశాలు నిరూపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానిక ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకుంది. మొత్తంగా రూ. 28,704.02 కోట్ల మేర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించింది. ఏపీకి సాయం చేసేందుకు ప్రధాని కార్యాలయం 2022 జనవరి 10న కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు అంశాలను ఖరారు చేసి, వాటిని పరిష్కరించే క్రమంలో సాధారణ పరిస్థితుల్లో సాధ్యం కానప్పటికీ ప్రత్యేక దృష్టితో సానుకూలంగా వ్యవహరించింది.
భారీగా రెవిన్యూ లోటు నిధుల విడుదల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ. 16,078 కోట్ల మేర రెవెన్యూ లోటు ఉందని కాగ్ సహా నాటి ప్రభుత్వం లెక్కించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 46(2) ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు ఉద్దేశించిన రూ. 1,500 కోట్లు సహా మొత్తం రూ. 5,617.89 కోట్లు విడుదల చేసింది. పూర్తి కసరత్తు తర్వాత ఈ మధ్యనే మిగిలిన రూ. 10,460.87 కోట్లు విడుదల చేసింది.
రుణ పరిమితిలో కోత – వెసులుబాటు
2016-17 నుంచి 2020-21 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రుణ పరిమితికి మించి రూ. 17,923.94 కోట్లు అదనంగా రుణాలు చేసింది. ఈ అదనపు రుణాన్ని తదుపరి ఏడాది రుణ పరిమితి నుంచి ఒకేసారి మినహాయించకుండా మూడేళ్ల పాటు కోత విధించేలా ఏర్పాటు చేసింది. 2023-24 నుంచి 2025-26 వరకు మరో మూడేళ్ల పాటు రూ. 8,000 కోట్లను 3 భాగాలుగా చేసి ఈ ఏడాది రూ. 2,666.67 కోట్లు మాత్రమే రుణ పరిమితి నుంచి కోత విధించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన ఈ ప్రత్యేక వెసులుబాటుతో ఎన్నికల ఏడాది అదనంగా రూ. 5,332 కోట్ల మేర రుణం తీసుకునే అవకాశం ఏపీ ప్రభుత్వానికి కలిగింది.
పోలవరానికి అదనపు నిధులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ. 14,418.39 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. ఇంకా రూ. 1,249.50 మాత్రమే చెల్లించాల్సి ఉంది. అయితే ఇవి సరిపోవన్న అభిప్రాయం వినిపించడంతో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమయ్యే సొమ్ముకు తోడు ఈ మధ్య వచ్చిన భారీ వరదల కారణంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో దెబ్బతిన్న భాగాల మరమ్మత్తుకు రూ. 2,000 కోట్లు అవసరమవుతాయని, వాటిని కూడా కేంద్రం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం రిపేర్ ఖర్చుతో కలుపుకుని మొత్తం రూ. 12,911.15 కోట్లు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఇవన్నీ రాష్ట్రానికి .. అభివృద్ధి కోసం కేంద్రం కల్పిస్తున్న ప్రయోజనాలు మాత్రమే. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి కాదు. వీటిని దుర్వినియోగం చేస్తే కేంద్రం చర్యలు తీసుకుంటుంది.