ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ బీజేపీలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో ప్రచారం ముగిసిన తర్వాత ఆయన నేరుగా తిరుపతి వెళ్లనున్నారు. అక్కడే మూడు రోజుల పాటు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులతో పాటు పార్టీ బలోపేతంపై కార్యాచరణను కూడా ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఏపీలో పర్యటించాలని కోరిన విష్ణువర్ధన్ రెడ్డి
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభల సమన్వయంలో కీలక పాత్ర పోషించిన ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అప్పట్లోనే ఏపీలో పర్యటించాలని కోరారు. తప్పకుండా ఏపీలో పర్యటిస్తానని మోదీ హమీ ఇచ్చారు. ఇప్పుడు సమయం, సందర్భం కలసి రావడంతో ఆయన ఏపీ పర్యటన ఖరారైంది. మూడు రోజుల కిందటే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు కావడంతో పార్టీని పటిష్ట పరిచేందుకు హైకమాండ్ ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతోందని చెబుతున్నారు.
28, 29, 30 తేదీల్లో మోదీ తిరుమల , తిరుపతి పర్యటన
ఈ నెల 28, 29, 30 తేదీల్లో మోదీ తిరుమల , తిరుపతిల్లో పర్యటిస్తారని అధికార వర్గాలకు సమాచారం వచ్చింది. 28వ తేదీన తెలంగాణలో ప్రచారానికి చివరి గడువు. ఆ రోజన తెలంగాణలో ప్రచారం చేసి.. తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది. 29వ తేదీన తిరుపతిలో కార్యక్రమాలు … తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 30వ తేదీన ఉదయం తిరుమల నుంచి ఆయన కార్యక్రమాలు ప్రారంభమయి.. తిరుపతిలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలన వరకూ ఉండే అవకాశం ఉంది. అలాగే పార్టీ కార్యక్రమాలపై సమీక్ష ఉంటుంది.
పార్టీకి దిశానిర్దేశం
గతంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. చార్జిషీట్ సహా పలు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. వాటన్నింటినీ సమర్థంగా బీజేపీ నేతలు అమలు చేశారు. ఎన్నికలకు ముందు కాబట్టి మరిన్ని కీలకమైన సూచనలు చేసే అవకాశం ఉంది. మోదీ పర్యటన తర్వాత ఏపీ బీజేపీలో ఉన్న ఏకపక్ష పోకడులకు ఓ పరిష్కారం వస్తుందని సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు. మోదీ తిరుపతి మూడు రోజుల పర్యటనలపై అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.