ప్రతినిత్యం జనంలో ఉండాలి. జనానికి మేలు జరిగే పనిచేయాలి. సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజల అభివృద్ధి సాగాలి. ఎక్కడా లోటుపాట్లు రాకూడదు. లోటు పాట్లు ఉంటే తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టాలి.. ప్రధాని మోదీ మదిలో ఉన్న ఆలోచన ఇది. అహరహం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రధాని మోదీ ఇప్పుడు అన్ని పథకాలు..ఆయా లబ్ధిదారులకు చేర్చాలని తపన పడుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించబోతున్నారు…
త్వరలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర
మారుమూల ప్రాంతాలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్న ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఒక యాత్రను ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని రెండు లక్షల 70 వేల గ్రామాలకు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. మారు మూల గ్రామాలకు సైతం ఇంటింటికి వెళ్లి పథకాలు అందాయా లేదా అని తెలుసుకోవడం అధికారుల విధిగా నిర్ణయించారు. దీపావళి తర్వాత ప్రారంభమయ్యే యాత్ర ఆరు నెలల పాటు సాగనుంది. ఈ లోపు ఎన్నికల వచ్చే అవకాశం ఉన్నందన ప్రతీ గ్రామాన్ని చేరుకునే యాత్రలను త్వరగా పూర్తి చేయాలని బీజేపీ అధిష్టానం అంటోంది. ప్రచార కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రథాలు తయారు చేయిస్తున్నట్లు సమాచారం.
కేబినెట్ సమావేశంలోనూ దిశానిర్దేశం
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ సంక్షేమ పథకాల ప్రస్తావన చేశారు. ఇంతవరకు పథకాలు అందనివారికి వాటిని చేర్చేలా చూడాలని ఆదేశించారు. అందులో కేంద్ర మంత్రులు ప్రత్యేక భూమిక పోషించాలన్నారు. పథకాలు అసంపూర్ణంగా ఉండటం సహేతుకం కాదని అంటూ వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆధికారులను సైతం ఆయన ఆదేశించారు. ప్రధాన్ మంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన, పిఎం కిసాన్, ఫసల్ బీమా యోజన, పోషణ్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ లాంటివి అందరు లబ్ధిదారులకు అందాయా లేదా తెలుసుకోవాలన్నారు. ఇక పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన, స్కిల్ డెవలప్మెంట్ స్కీములుతో పాటు ఇటీవలే ఆవిష్కరించిన విశ్వకర్మ యోజన ఎంత మేర ప్రయోజనం కలిగిస్తున్నాయో తెలుసుకోవాల్సిన అనివార్యత ఉంది.
సంక్షేమంలో వివక్ష తగదు…
ఒక అంశంలో ప్రధాని మోదీ గట్టిగా దిశానిర్దేశం చేశారనుకోవాలి. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్షకు తావివ్వకుండా పనిచేయాలని ఆయన అధికారులను, ప్రజల్లో తిరుగుతున్న పార్టీ వారిని ఆదేశించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందేటట్టు చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఏప్రిల్ – మే నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికల సమయానికి ప్రతీ లబ్ధిదారుడి కళ్లలో సంతోషాన్ని చూడాలన్నదే ఇప్పుడు మోదీ లక్ష్యంగా తెలుస్తోంది. అప్పుడు ప్రధానిగా తాను హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందని ప్రధాని భావిస్తున్నారు. పేద, గ్రామీణ ప్రజలు సంతోషంగా ఉంటేనే పార్టీకి మనుగడ సాధ్యమని మోదీ విశ్వసిస్తున్నారు.