ప్రకాష్ రాజ్ బురదబుద్ది – దేశంపై ఇంత విద్వేషమా ?

మేధావుల పేరుతో చెలామణి అయ్యే వారిలో బుర్రలో ఎంత బురద ఉంటుందో.. సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి నిరూపించారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆయన ఎంత ఎక్కువగా దేశాన్ని ద్వేషిస్తున్నారో స్పష్టం చేసేలా ఉంది. విక్రమ్ ల్యాండర్ అద్భుత విజయం సాధిస్తున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా పంపిన మొట్టమొదటి ఫోటో అని రాసి ఒకతను టీ వడపోస్తున్న ఫోటోను ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇస్రో విజయాన్ని పాకిస్థానీయులు కూడా ఇలా కించపర్చరు కదా !

అధికార బిజెపి పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేయడంలో ముందుండే ప్రకాష్ రాజ్ ఈసారి మాత్రం సోషల్ మీడియాలో తాను చేసిన ట్వీట్ కు తానే విమర్శల పాలయ్యాడు. జూలై 14 వ తేదీన ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ -3 ఆగస్టు 23వ తేదీన చంద్రుడుపై అడుగుపెట్టనున్న నేపథ్యంలో యావత్ భారతదేశం ఆ అద్భుత క్షణం కోసం ఎదురు చూస్తుంటే ప్రకాష్ రాజ్ మాత్రం ఈ విజయవంతమైన ప్రయోగాన్ని అభినందించకపోగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాడు. పాకిస్థానీయులు కూడా ఇస్రో విజయాన్ని గొప్పగా చెప్పుకుంటారు. స్ఫూర్తిగా తీసుకుంటారు. కానీ దేశంపై దండెత్తే అంతర్గత శత్రువులు మాత్రం అలా కాదని .. ప్రకాష్ రాజ్ నిరూపించారు.

భారత్ విజయాన్ని భరించలేకపోతున్నారా ?

ఒక వ్యక్తి టీ వడబోస్తున్న ఫోటో పోస్ట్ చేసి చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ పంపించిన ఫోటో… వావ్ అంటూ పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అదే స్థాయిలో ప్రకాష్ రాజ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పు చేస్తే తప్పని చెప్పడంలో తప్పులేదు కానీ ఏది పడితే దాన్ని విమర్శించే ప్రయత్నం చేయకూడదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. చంద్రయాన్-3ని జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. ఆగస్టు 5న చంద్రుడు కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ -3 ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి విజయాన్ని ప్రకాష్ రాజ్ భరించలేకపోవడం ఆశ్చర్యంగా మారింది.

తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు

“ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ పై రాజకీయాలకు సంబంధం లేకుండా మొత్తం భారతదేశం గర్వించదగ్గ విషయం. దీనిని రాజకీయం చేయడం సరికాదని రాజకీయాలు, ట్రోలింగ్ కు మధ్య ఉన్న తేడాను తెలుసుకోండి” అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. “ఒకరిని ద్వేషించడానికి, దేశాన్ని ద్వేషించడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇది కూడా తెలుసుకోలేని మీ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది” మరొకరు ట్వీట్ లో రాసారు. “ఇది చాలా బాధాకరం. చంద్రయాన్-3, ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ఈ మిషన్ కొన్నివేల బిలియన్ హృదయాలల్లో ఐక్యత, అభిరుచి, వెలుగులు నింపే అరుదైన విషయాలలో ఒకటి. మీరు దీనిని గ్రహించలేకపోతే, దేశం పట్ల మీకున్న ప్రేమ కంటే ఒక వ్యక్తి మీద మీకున్న ద్వేషం చాలా తీవ్రంగా కన్పిస్తుంది” అని మరో నెటిజన్ మండిపడ్డాడు. “మీ దేశం, మీ స్వంత ప్రజల పురోగతి, విజయాలు, ప్రయత్నాలను మీరు ద్వేషించడం ప్రారంభిస్తే… ద్వేషం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది” అని మరొకరు విరుచుకుపడ్డారు.

ప్రకాష్ రాజ్ పక్కాగా ఓ దేశ వ్యతిరేకిగా ప్రజల ముందు నిలబడ్డారు. ఆయన బుద్ది బురదలో ఉందని తేలిపోయింది. ఇక ఆయనను ఎవరైనా అభిమానిస్తూ.. వారూ అదే తరహా అని అనుకునేప్రమాదం ఉంటుంది.