పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు విపక్షాలు పరోక్షంగా మద్దతిస్తున్నాయన్న విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇది రాజకీయ అంశం కాదు. భద్రతా లోపం. ఎక్కడ జరిగింది.. ఎలా జరిగిందన్న అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. బయట శక్తుల ప్రమేయం ఉంటే దాన్ని కూడా బయటకు లాగుతున్నారు. అత్యంత సున్నితమైన ఈ విషయంలో విపక్షాలు భారత్ పరువు తీసేలా వ్యవహరిస్తున్నాయి. అంతా తెలిసి కూడా రాజకీయం చేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతోనే విపక్షాల్లో నిస్పృహ
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో నిస్పృహకు లోనై.. పార్లమెంటులో జరిగిన ఘటనకు రాజకీయరంగు పులుపుతున్నాయన్న విమర్శలు దేశ ప్రజల నుంచి వస్తున్నాయి. . ఈ నెల 13న ఇద్దరు ఆగంతకులు లోక్‌సభ చాంబర్లోకి దూకారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారెవరూ దీనిని అంగీకరించరు.. కానీ ఇదేదో నిరసన కార్యక్రమం అన్నట్లుగా చూపించడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దేశ ప్రజలు ఎన్నుకున్న ఎంపీల భద్రతను పణంగా పెట్టడం నిరసన ఎలా అవుతుందో ఆ పార్టీలు చెప్పలేకపోతున్నాయి.
బీజేపీ ఎంపీలు సంయమనంతో ఉండాలన్న మోదీ
పార్లమెంట్ లో రచ్చ చేస్తున్న విపక్ష ఎంపీల తీరును ప్రజలకు వదిలేశారు మోదీ. బీజేపీ ఎంపీలు సంయమనంతో ఉండాలి. మన నోటిని అదుపులో ఉంచుకుంటూనే విపక్షాల తీరును బట్టబయలు చేయాలి. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు పార్లమెంటు కార్యకలాపాల్లో పాలుపంచుకున్నా.. పాలుపంచుకోకున్నా.. మనం మాత్రం పాల్గొనాలని పార్లమెంటరీ పార్టీ భేటీలో స్పష్టం చేశారు. ఉభయసభల్లో ముఖ్యమైన బిల్లులు చర్చకు వస్తున్నాయని.. కానీ మంచి పనుల్లో పాలుపంచుకోవడం విపక్షాలకు రాసిపెట్టి లేదని అన్నారు. ఎంపీలకు మోదీ దిశానిర్దేశం స్ఫూర్తి నింపింది. అలజడి కాదని.. దేశ ప్రజల కోసం అర్థవంతమైన చర్చలు ముఖ్యమన్న మోదీ సందేశం వారిలో ఉత్సాహాన్ని నింపింది.
కుట్ర పూరితంగానే సెక్యూరిటీ బ్రీచ్
సెక్యూరిటీ బ్రీచ్ కు పాల్పడిన వారు.. భారీ కుట్రతోనే వచ్చారు. పార్లమెంటులో అలజడికి నిందితులు ఒక వాట్సప్ గ్రూప్‌ను సృష్టించుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఆ వాట్సప్ గ్రూపులో 7-8 మంది సభ్యులు ఉన్నారని, కుట్ర మొత్తాన్నీ ఆ గ్రూపుతోనే సభ్యులకు తెలియజేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు .. విదేశీ శక్తుల ప్రమేయం ఉంటే ఆ వివరాలు వెల్లడించనున్నారు.