పెరగనున్న పీఎం కిసాన్ సాయం..

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తోంది. అందులోనూ దేశ జనాభాలో అత్యధిక శాతం ఉండే రైతులకు అదనంగా సాయం చేసేందుకు ఎప్పుడూ వెనుకాడబోమని బీజేపీ నిత్యం ప్రకటిస్తూనే ఉంది. ఇకపై కూడా రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు..

పీఎం కిసాన్ కు అదనంగా రూ. 2 వేలు

మోదీ ప్రభుత్వం 2018లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకాన్ని ప్రారంభించింది. దానిలో భాగంగా ఏటా ప్రతి రైతు కుటుంబానికి మూడు దఫాలుగా రూ. 6 వేలు అందిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసుకునేందుకు ఈ పీఎం కిసాన్ నగదు బదిలీ పథకం ఉపయోగపడుతుంది. తెలంగాణలో ఇప్పటికే రైతు బంధు అమలవుతుండగా అన్నదాతలకు రెండు స్కీములు వర్తిస్తున్నాయి. ఇప్పుడు పిఎం కిసాన్ కింద నగదు సాయాన్ని రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు పెంచాలని కేంద్ర భావిస్తోంది. ఈ నగదు బదలీ పెంపు వల్ల కేంద్రప్రభుత్వానికి మరో రూ.2 లక్షల కోట్లు వ్యయమవుతుంది. ఇప్పటికే ప్రతీ ఏటా బడ్జెట్ లో రూ.6 లక్షల కోట్లు వయం చేస్తున్నారు. అదనపు వ్యయానికి భయపడేది లేదని రైతు సంక్షేమమే తమ ధ్యేయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పథకం ప్రారంభించినప్పటి నుంచి దేశ ఖజానాకు రూ. 2.42 ట్రిలియన్ రూపాయలు ఖర్చయ్యింది.

రైతు ఆదాయం పెంచడమే ధ్యేయం

దేశంలోని 140 కోట్ల పైచిలుకు జనాభాలో 65 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. మోదీ పార్టీకి రైతులు అతి పెద్ద ఓటు బ్యాంకులుగా ఉన్నారు. వరుసగా మూడో సారి అధికారానికి రావాలని మోదీ ఆకాంక్షిస్తున్న తరుణంలో ఆయన రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 55 శాతం మంది ఓటర్లు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నప్పటికీ …ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని మోదీ నిర్ణయించుకున్నారు. అందుకే రైతులకు ఉపయోగపడే విధానాలను ప్రవేశ పెడుతున్నారు. కొన్ని రకాల వరి ఎగుమతిపై నిషేధం విధించడం ద్వారా దేశీయంగా ప్రయోజనం కలిగిస్తున్నారు. గత అర్థ దశాబ్దిలో ఈ ఏడాదే వర్షాలు పడక రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది..

రైతులకు సబ్సిడీ మీద రుణాలు..

కరోనా కాలంలో ప్రవేశ పెట్టిన ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని కేంద్ర నిర్ణయించారు. వ్యవసాయదారుల్లో వ్యాపార దృక్పధాన్ని పెంచి పంటలకు మంచి ధర అందించే దిశగా పీఎం కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్కీములు కేంద్రం ప్రారంభించింది. దీనిలో భాగంగా రూ. 15 లక్షలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 15 నుంచి 20 మంది రైతులు కలిసి ఒక సంఘంగా ఏర్పడి కేంద్రప్రభుత్వ వెబ్ సైట్లోకి లాగిన్ అయితే వారికి నగదు సాయం అందుతుంది. టెక్నికల్, మార్కెటింగ్, క్రెడిట్ ప్రాసెసింగ్, ఇర్రిగేషన్ వంటి సౌకర్యాలు రైతులకు కల్పించి వారికి సాయపడతారు..