రకరకాల ఎడారి మొక్కల గురించి చాలామందికి తెలుసు. అవి ఎప్పటికప్పుడు కొద్ది పాటి నీరున్నా జీవించగలుగుతాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మొక్క అలా కాదు. వందల సంవత్సరాలు గడిచినా నీరు లేకుండా ఉండిపోతాయి. పెరుగుదల లేకుండా అలా ఉండిపోయి.. నీరు తగలగానే మళ్లీ పుట్టగలదు. ఇలా ఎన్నిసార్లైనా మళ్లీ మళ్లీ జన్మించగలదు. ఆశ్చర్యకరమైన ఈ మొక్కకు సంబంధించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్లు.
ఎండిపోయినట్టే ఉంటాయి కానీ..
మొక్కలకు నీళ్లు పోస్తేనే బతికుంటాయి, చుక్కనీరుకూడా తగలకుండా ఉండిపోతే ఎండిపోతాయి. కానీ ఓజాతికి చెందిన మొక్కలు మాత్రం నీరు లేకుండా ఏళ్ల తరబడి బతుకుతాయి. నీటిచుక్కకోసం వందలకిలోమీట్లు దొర్లుకుంటూ వెళతాయి. నీరు తగిలిన వెంటనే ప్రాణం లేచొచ్చినట్టు విచ్చుకుంటాయి. అందుకే వీటిని పునరుజ్జీవ మొక్కలంటారు. వాటి పేరు ‘సెలాజినెల్లా లాపిడోఫిల్లా’. చూడటానికి చనిపోయిన మొక్కల లాగా, ఎండిపోయిన మొక్కల లాగా ఉంటాయి. నీరు తగలనంతవరకూ అవి అలానే ఉంటాయి. ఒక్కసారి నీరు తగలగానే ప్రాణం లేచొచ్చినట్లు.. పువ్వులా విచ్చుకుంటాయి. ఆకులన్నీ తెరచుకుంటాయి. ఒక్కసారిగా మొక్క హుషారుగా మారిపోతుంది. ఆఫ్రికాలో సహారా ఎడారి లాంటి చోట నీరు దొరకడం చాలా కష్టం. కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్తేగానీ నీరు దొరకదు. ఒక్కోచోట సంవత్సరంలో ఒక్క రోజు కూడా వాన పడదు. అలాంటి చోట ఇలాంటి మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ నీరు లేనప్పుడు బంతిలా ముడుచుకుపోతాయి. గుండ్రంగా మారిపోతాయి. ఆ తర్వాత గాలి ఎటు వస్తే అటు దొర్లుతూ వెళ్తాయి. ఇలా ఇవి వందల కిలోమీటర్లు దొర్లుతాయి. ఏదో ఒక రోజున నీరు ఉన్న చోటికి చేరి చెమ్మ తగలగానే అక్కడ ఉండిపోతాయి. అక్కడ నీరు ఉన్నంతకాలం స్థిరంగా ఉండిపోతాయి. మళ్లీ లైఫ్ సైకిల్ రిపీట్ అవుతుంది. గుండ్రంగా మారతాయి కాబట్టి వీటిని రాయి పువ్వు (stone flower) అని కూడా అంటారు.
పునర్జన్మ మొక్కలు ఎన్నో రకాలు
పునర్జన్మ మొక్కలు చాలా రకాలున్నాయి. ఇవి నీటిచుక్క దొరకనప్పుడు మంచు బిందువులను స్వీకరించి బతికేస్తాయి. వీటి ఎత్తు 5 సెంటీమీటర్లకు మించి ఉండదు. ఈ మొక్కల్ని ప్రస్తుతం ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో అమ్ముతున్నారు. నీటితో పెద్దగా పనిలేదు కాబట్టి కార్యాలయాల్లో పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఈ మొక్కల ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుంటున్నారు.