పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ మాత్రం ఆమె ప్రకటనలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్లు, గురువిందకు నలుపు తెలియనట్లుగా ఆమె ప్రవర్తిస్తున్నారు..
అవినీతిని నిరోధిస్తామంటున్న మమత
జూలై 8న ఒకే దశలో జరిగే పంచాయతీ ఎన్నికలకు సీఎం మమత విస్తృత ప్రచారేం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కింది స్థాయిలో అవినీతిని నిర్మూలిస్తామని ఓ ప్రకటన చేశారు. ఎవరికీ డబ్బులిచ్చి పనులు చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. పైగా క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థులనే ఎన్నికల బరిలోకి దించుతున్నామని మమత చెప్పుకున్నారు.
ఉపాధి హామీ పథకంలో అవినీతి
గతేడాది ప్రారంభంలోనే బెంగాల్ అంతటా ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గుర్తించింది. పనుల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, మెటిరీయల్ లో నాణ్యత లోపించిందని, పంచాయతీ పెద్దలు డబ్బు తినేశారని కేంద్రం గుర్తించి నిధుల విడుదలకు బ్రేకులు వేసింది. దీనితో అప్పట్లో చెంపలేసుకున్న మమతా బెనర్జీ ప్రభుత్వం, తప్పు చేసిన వారి నుంచి డబ్బు రికవరీ చేస్తామని హామీ పలికింది. ఏదో మొక్కుబడిగా ఇన్స్ పెక్షన్ టీములను పంపి సర్వేలు చేయించినా… పోయిన డబ్బు మాత్రం రాలేదు. ప్రభుత్వ అవినీతి కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గణాంకాలు చెప్పకనే చెబుతున్నారు. ఉపాధి హామీ లబ్ధిదారుల సంఖ్య 77 లక్షల నుంచి గతేడాది ఆఖరుకు 16 లక్షలకు పడిపోయింది. దీనితో కార్మిక, కర్షకులు ఉపాధి లేక తమ ప్రాంతాలను వదిలి ఇతర ప్రదేశాలకు వలస పోవాల్సి వచ్చింది.
గ్రామీణ అవాస యోజనలో అవినీతి
గ్రామీణ అవాస యోజన క్రింద పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలి. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అందుతాయి. ప్రభుత్వం అధికారులు రూపొందించిన జాబితాలో అర్హత లేని వారి పేర్లు కూడా చేర్చారని గుర్తించారు. మూడంతస్థుల భవనాలు ఉన్న వారిని కూడా పేదలుగా ప్రకటించి, ఈ జాబితాలో చేర్చినట్లు తేల్చారు. దీనితో ఐదున్నర లక్షల మంది పేర్లు తొలగించాల్సి వచ్చింది. ఆ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారిందనుకోండి.
రిక్రూట్మెంట్ లో అవినీతి
ఏయిడెడ్ పాఠశాలల్లో గ్రూప్ -సీ, గ్రూప్ – డీ ఉద్యోగాలతో పాటు, ప్రభుత్వ స్పాన్సర్డ్ ఉపాధ్యాయుల నియామకంలో కూడా గత ఏనిమిది సంవత్సరాలుగా అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లో నెంబరు టూగా వెలిగిన మాజీ విద్యా శాఖామంత్రి పార్థా ఛటర్జీ టైమ్ లో భారీ స్కాం జరిగిందని భావించిన కోల్ కతా హైకోర్టు.. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు ఆదేశించింది. తర్వాత ఆయన జైలుకు వెళ్లారు. రాష్ట్రంలో పశువులు, ఇసుక స్మగ్లింగ్ పై విచారణ జరిపిన కేంద్ర సంస్థలు భిర్భూం జిల్లా తృణమూల్ అధ్యక్షుడైన అనుబ్రతా మోండల్ దీని వెనుక ఉన్నారని గుర్తించారు. మమత బెనర్జీకి అత్యంత సన్నిహితులైన వారిలో అనుబ్రతా మోండల్ ఒకరని తేల్చారు. ఇంత అవినీతి పెట్టుకుని దాన్ని నిరోధిస్తామని మమత చెప్పడం విడ్డూరంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి..