పిల్లి సుభాష్‌తో ప్రారంభం కాలేదు.. ఆయనతోనే ఆగదు ! వైసీపీలో జగన్ అంటే భయం పోయిందా ?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో సీఎం, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఏది చెబితే అది. ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లుగా. కానీ ఇటీవలి కాలంలో ఆయన ఆయన ఒక్క సారి చెప్పినా వినిపించుకోని వాళ్లే ఎక్కువ అవుతున్నారు. పార్టీ కండువాను విసిరేసి వెళ్లిపోతున్నారు. కావాలంటే పదవుల్నీ వదిలేస్తామంటున్నారు. ఈ పరిరిస్థితి వైసీపీలో గందరగోళం సృష్టిస్తోంది.

వైసీపీలో క్రమశిక్షణ తగ్గిపోతోందా ?

వైసీపీలో క్రమశిక్షణ రాను రాను తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన పిలిస్తే.. టిక్కెట్ ఇస్తే సరే లేకపోతే.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని మొహం మీదనే చెప్పేసి వస్తున్నారు.. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అదే చెబుతున్నారు. ఒక్క సుభాష్ చంద్రబోస్ మాత్రమే కాదు… ఇటీవలి కాలంలో వైసీపీ నేతంతా అదే భావనలో ఉన్నారు. ఇతర పార్టీల్లో తమకు చోటు ఉంటుందని అంచనాకు వచ్చిన చోట్లవైసీపీ నేతలను ఆపడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా నెల్లూరు లో నేతలంతా అదే పని చేయడం దీనికి నిదర్శనం. చివరికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు కూడా దండం పెట్టి జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు రామచంద్రాపురం నుంచి పిల్లి బోస్ కూడా అదే చేస్తున్నారు.

ఇతర పార్టీల్లో చాన్స్ చూసుకుని జగన్ మోహన్ రెడ్డిని ధిక్కరిస్తున్నారా ?

రామచంద్రాపురంలో టీడీపీ నేత త్రిమూర్తులు పార్టీ మారిపోయి … వైసీపీ తరపున మండపేటలో పని చేసుకుంటున్నారు. దీంతో టీడీపీకి నాయకత్వ సమస్య ఉంది. కొడుకును టీడీపీ నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నారు. వైసీపీలో ఉంటే టిక్కెట్ రాదని పంచకర్ల రమేష్ కూడా చేరిపోయారు. వైసీపీ నుంచి ఇంకా పలువురు ఇతర పార్టీల్లో చేరుతారన్నప్రచారం ఉంది. గతంలోనే ఓ సీనియర్ నేత ఆధ్వర్యంలో నేతలు బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. అందుకే జగన్ తమ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా కూడా ప్రకటించుకున్నారని అంటున్నారు.

జగన్ అత్యంత విధేయులే ఎందుకు ధిక్కరిస్తున్నారు ?

నిజానికి ఇప్పుడు ఇలా వైసీపీలో ధిక్కారం వినిపిస్తున్న వారంతా జగన్ మోహన్ రెడ్డి రెడ్డి వీర విధేయులు.. పార్టీని నమ్ముకున్న వారు. జగన్ రెడ్డితో పాటు మొదటి నుంచి నడుస్తున్న వారే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వాళ్లు పార్టీ మారుతారని ఎవరూ అనుకోలేరు. అలాగే పిల్లి సుభాష్ కూడా. పార్టీ వేరు.. వాళ్లు వేరని అనుకోలేదు. కానీ వారంతా దూరమవుతున్నారు. వైసీపీలో అంతర్గత సమస్యలు ఇలాంటి విధేయుల్ని కూడా దూరం చేస్తున్నాయని స్పష్టంగా నే తెలుస్తూనే ఉంది. ఇవన్నీ ఇప్పుడు పట్టించుకునే పరిస్థితిలో ఆ పార్టీ లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయన్న అభిప్రాయ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.