మంగళగిరిలో లోకేష్ ప్రత్యర్థి ఎవరు ? – ఖరారు చేయలేకపోతున్న వైసీపీ !

మంగళగిరి వైసీపీ టికెట్ పంచాయతీ ఇప్పట్లో తేలేటట్లు కనిపించడం లేదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే.. జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ బాట పట్టారు. దాంతో వచ్చే ఎన్నికలకు మంగళగిరిలో బీసీ కార్డు ప్రయోగించడానికి నిర్ణయించిన వైసీపీ. గంజి చిరంజీవిని ఇన్‌చార్జ్‌గా ప్రకటించింది. అయితే ఎన్నికల్లో పోటీ చేసేది ఆయనేనా? అన్న కన్‌ఫ్యూజన్ వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అక్కడ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు తామే అభ్యర్ధులమని చేస్తున్న హడావుడితో .. అసలు కేండెట్ ఎవరన్నది క్లారిటీ లేకుండా పోయింది.

లోకేష్ మరోసారి పోటీకి రెడీ అయిన నియోజకవర్గం మంగలఘరి

సీఎం జగన్ నివాసముండే నియోజకవర్గం మంగళగిరిలో గత రెండు సార్లు వైసీపీ అభ్యర్ధే ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో అమరావతి సెంటిమెంట్‌తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేసినప్పటికీ.. మంగళగిరిలో వైసీసీ హావేనే కొనసాగింది. ఈ సారి కూడా లోకేశ్ అక్కడ నుంచే పోటీకి సిద్దమయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన ఆర్కే పార్టీని వీడటంతో మంగళగిరిలో బీసీ కార్డు ప్రయోగానికి తెర లేపారు సీఎం జగన్.. స్థానికంగా చేనేత వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో.. అదే వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్‌ గంజి చిరంజీవిని ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు.

గంజి చిరంజీవికి ఖరారు కాని టిక్కెట్

మంగళగిరి వైసీపీ టికెట్‌పై మూడు వర్గాలు టికెట్ తమకు ఖాయమైనట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. గంజి చిరంజీవితో పాటు.. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి మరుగుడు హన్మంతరావు వర్గాలు తమ నేతకు టికెట్ కన్‌ఫర్మ్ అయినట్లు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. దాంతో అక్కడి వైసీపీ శ్రేణులు ఎవరి వెంట నడవాలో అర్ధంకాక అయోమయానికి గురవుతున్నారు. సమన్వయకర్తగా చిరంజీవిని నియమించిన దగ్గర్నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అవి విఫలం అవ్వడంతో ఎమ్మెల్యే అనుచర గణాన్ని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు వెళుతూ ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఆశించిన ఆదరణ లభించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.

కాండ్రు కమల వైపు మొగ్గు

మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టికెట్ రేసులోకి వచ్చి వైసీపీ పెద్దలతో లాబీయింగ్ మొదలుపెట్టారు. కమలతోపాటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సైతం తన కోడలిని ఎన్నికల బరిలో దించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తనకు పరిచయం ఉన్న పార్టీ పెద్దల దగ్గర ఒక్క ఛాన్స్ ఇవ్వమని మొరపెట్టుకుంటున్నారు. లోకేశ్‌ను ఓడించాలని పట్టుదలగా ఉన్న వైసీపీ పెద్దలు ఆ ముగ్గురిలో ఎవరిని కరుణిస్తారో కాని.. క్లారిటీ రావడం లేదు.