ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నారు ? అని రాష్ట్రం బయట ఎవరినైనా అడిగితే.. ఇంకెవరు బీజేపీనే అంటారు. మరి ప్రతిపక్ష పార్టీ ఏది అంటే… అది కూడా బీజేపీనే అంటారు. ఇది సర్కాస్టిక్ గా అనిపించవచ్చు కానీ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఇది నిజం కదా అనిపించక మానదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లులు పెట్టినా.. రెండు పార్టీలు పోటీ పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు మద్దతుగా ఓటేశారు. ఎవరూ వ్యతిరేకించాలనుకోవడం లేదు.
బీజేపీ పాలన సంతృప్తికరంగా ఉందంటున్న జగన్, చంద్రబాబు
కేంద్రంలో బీజేపీ విధానాలను పూర్తిగా సమర్థిస్తానని… మోదీ పాలన అద్భుతమని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే టీడీపీ పార్లమెంట్ లో వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఇక జగన్ రెడ్డి సర్కార్ గురించి చెప్పాల్సిన పని లేదు. అన్ని రకాల ప్రయోజనాలను పొందుతూ.. … సంపూర్ణమైన మద్దతు ఇస్తోంది. ఇతర పార్టీలు కూడా బీజేపీకే మద్దతు ఇవ్వాలని చెబుతూంటారు కూడా. అంటే రెండు పార్టీలు బీజేపీ విషయంలో సంతృప్తికరంగా ఉన్నాయి.
ఏపీలో ఎవరికి సీట్లొచ్చినా బీజేపీకే మద్దతు
ఏపీలో ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలో ఏ పార్టీ ఎన్ని గెలిచినా అంతిమంగా పార్లమెంట్లో బీజేపీకే మద్దతు లభిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే కాదు.. పార్లమెంట్ లో .. ఏ బిల్లుపై చర్చ జరిగినా .. ఓటింగ్ జరిగినా అదే విషయం రుజువు అవుతోంది. అందుకే.. ఏపీలో బీజేపీ తిరుగులేని స్థాయిలో ఉందని… అక్కడి ఇరవై ఐదు సీట్లు ఆ పార్టీకి ఇప్పటికే దఖలు పడ్డాయని చెప్పుకుంటున్నారు. కానీ ఏపీలో బీజేపీ నిజంగా బలంగా ఉందా అంటే లేదు. రెండు ప్రాంతీయపార్టీలు వ్యూహాత్మకంగా బీజేపీ ఎదగకుండా తాము గెలిచినా బీజేపీకే మద్దతు కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్న భావన కల్పించి బీజేపీ సానుభూతి పరుల ఓట్లను కూడా పొందాలనే ప్లాన్ అమలు చేస్తున్నాయి. అలాగే కేంద్రం సపోర్టు కూడా పొందుతున్నారు.
ఆలోచనలో ప్రజలు – నేరుగా బీజేపీకే ఓటేస్తే ?
ఏపీ ప్రజల ఆలోచన ఇప్పుడే మారుతోంది. తాము ఎవరికి ఓటేసినా బీజేపీకే మద్దతు ఇస్తారు కాబట్టి తాము నేరుగా బీజేపీకి ఓటేస్తే మేలని భావిస్తున్నారు. ఈ అంశంపై చర్చ ప్రారంభమయింది. మధ్యలో ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేయడం ద్వారా వారు వ్యక్తిగత ప్రయోజనాలను కేంద్రం ద్వారా పొందే ప్రయత్నాలు చేసుకుంటున్నారని.. తామే నేరుగా బీజేపీకి మద్దతు ఇస్తే.. కొంత మంది అక్రమాలను నిరోధించడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అంచనా వస్తున్నారు. ఈ అంశంపై ఇప్పుడిప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. ఏపీలోని అన్ని వర్గాల ప్రజల్లో చర్చలు జరిగితే.. . ప్రజలు అంతిమంగా ఓ నిర్ణయం రావడానికి అవకాశం ఉంటుంది.