ప్రజాపోరు పేరుతో గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు భారీ సక్సెస్ అయ్యాయి. అదే స్థాయిలో మరోసారి ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజాపోరు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అప్పట్లో ఈ సభలను సక్సెస్ చేసిన ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మరోసారి ఆ బాధ్యతలు తీసుకున్నారు.
ప్రజలతో కలిసి ప్రజా పోరు
వైకాపా అవినీతి, అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు భాజపా ప్రజలతో కలసి ప్రజాపోరు చేయాలని బీజేపీ నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ రాష్టంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 21 నుంచి 29 వరకు 9 రోజుల పాటు ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించనుంది. ప్రజాపోరు కార్యక్రమం కన్వీనరు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వంపై పోరాటం
పన్నుల భారాలు మోపి, ధరలు అదుపు చేయలేక ప్రజలను ఆర్ధిక సంక్షోభంలో నెట్టివేసిన వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించే అవకాశం ఇప్పుడు వచ్చిందని .. విష్ణువర్ధ్ రెడ్డి భావిస్తున్నారు. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఉద్దేశించినదే ‘‘ప్రజాపోరు’’ కార్యక్రమంగా చెప్పారు. ఒకవైపు వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిని ప్రజలకు వివరించడం ద్వారా వైకాపాను ఓడిరచడం…… మరోవైపు శ్రీనరేంద్రమోడీ సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి అందించిన సంపూర్ణ సహకారం వివరించడం ద్వారా ప్రజల మద్దతును పొందాలనేది కార్యక్రమం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యం
మూడోసారి కూడా భాజపానే కేంద్రంలో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని అందువల్ల రాష్ట్రంలో కూడా భాజపా ప్రభుత్వం ఉంటే డబులింజన్ సర్కార్ సౌలభ్యంతో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని విష్ణువర్ధన్ రెడ్డి భావిస్తున్నారు. ప్రజలకు భాజపా దగ్గరయ్యేందుకు ప్రజాపోరు కార్యక్రమాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవాలని నాయకులను కోరుతున్నారు. ఈ నెలలో చేయబోయే ప్రజాపోరుతో వైకాపా ఓటమి ఖాయమైపోయిందని ప్రజాపోరు కన్వీనరు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి నమ్మకంతో ఉన్నారు.
గ్రామ గ్రామంలో ప్రజా పోరు
ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల కనిపించే వ్యతిరేకతకు గతేడాది 15 రోజుల పాటు జిల్లా స్ధాయిలో చేసిన ప్రజాపోరు కార్యక్రమం ప్రభావం ఒక ప్రధాన కారణం. ఆ కార్యక్రమం ద్వారా జరిగిన వేలకొద్దీ వీధి సమావేశాలు ప్రజలను ఆలోచింప చేశాయి. ఇదే కార్యక్రమం ఇప్పుడు అసెంబ్లీ స్ధాయిలో జరుగుతుందని విష్ణువర్ధ్ రెడ్డి తెలిపారు. నాయకుల ప్రసంగాలు, కరపత్రాల పంపిణి, డిజిటల్ మాధ్యమాల ప్రసారం ద్వారా ప్రచారం చేస్తామన్నారు. అసెంబ్లీకి ఒకటి చొప్పున 175 ప్రచార రధాలను కూడా ఈ కార్యక్రమం కోసం సిద్దం చేస్తున్నామన్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 50 మిని బహిరంగ సభలు జరుగుతాయని, పార్లమెంటు స్ధాయిలో ఒక భారీ బహిరంగసభ జరుగుతుందని, కేంద్రమంత్రులు, జాతీయ, రాష్ట్ర స్ధాయి నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ప్రజలపై వేసిన పన్నుల భారాలు, ప్రభుత్వ అవినీతి, వనరుల దోపిడి, అభివృద్ధి లేమి, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, అన్ని వర్గాలను మోసం చేయడం, మహిళలకు వేధింపులు, ఆగిపోయిన అవస్ధాపన, స్తంభించిన పారిశ్రామిక రంగం, స్ధానిక సమస్యల ప్రస్తావన వంటి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తారు.