మోదీపై ప్రజాభిమానం – బీజేపీయే కావాలనే నినాదం !

కేంద్రం పథకాలతో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు కనిపించింది. కర్ణాటక ప్రభుత్వ అభివృద్ధి తో వారి జీవన ప్రమాణాల్లో మెరుగుదల కనిపించింది. ఆ కృతజ్ఞత తీర్చుకోవాలన్న అభిప్రాయమూ వారిలో మెండుగా ఉంది. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన రెడ్డి ప్రచారంలో తనకు ఎదురైన అనుభవాలను భారత్ ఫస్ట్ పోస్ట్‌తో పంచుకున్నారు.

                   కర్ణాటక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి మెరికల్లాంటి యువనేతల్ని కొంత మందిని పార్టీ పని కోసం పంపాలని  హైకమాండ్ పెద్దలు నిర్ణయించుకున్న తర్వాత వారి మనసులో మెదిలిన వారిలో నేనొకరిని. గత కర్ణాటక ఎన్నికల్లోనూ చురుకుగా పని చేసి ఉండటంతో ఈ సారి కూడా కీలక బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారు. అది నా అదృష్టం. పార్టీ కోసం ఎలాంటి బాధ్యతను తీసుకోవడానికైనా సిద్ధమేనని పెద్దలకు తెలుసు కాబట్టి మరోసారి ఆలోచించలేదు. నాకు ఇలా ఆదేశం వచ్చిన మరుక్షణం అలా కర్ణాటకలో వాలిపోయారు. ప్రతీ క్షణం పార్టీ పనిని ఆస్వాదించా.  నిజానికి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఎదురీదుతోందన్న అభిప్రాయం నేను కర్ణాటకలో అడుగు పెట్టేసరికే ఎక్కువగా ఉంది. బహుశా అది నా మనసులో ఉందేమో కానీ.. ప్రచారంలో నెగెటివ్ స్పందన వస్తుందేమో అనుకున్నా. కానీ నాకు ఎదురైన అనుభవాలు భిన్నం. 

మొదట ఎక్కువగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చిక్ బళ్లాపూర్, గౌరిబిదనూరు, బాగేపల్లి వంటి ప్రాంతాల్లో ప్రచారం చేశాను. నిజానికి గతంలో ఈ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి గొప్ప ఫలితాలు రాలేదు. సంప్రదాయంగా అక్కడ బీజేపీ బలంగా లేదు. కానీ ప్రచారానికి వెళ్లినప్పుడు ఎక్కువ మంది బీజేపీ గురించి పాజిటివ్‌గా స్పందించారు. ఓ పేదకుటుంబం .. కరోనా సమయం నుంచి తమకు వస్తున్న ఉచిత రేషన్ గురించి చెప్పి బీజేపీ , మోదీ ప్రాణాలు కాపాడారని కన్నీరు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా చికిత్స పొందిన వారూ పెద్ద సంఖ్యలో కనిపించారు. కేంద్ర పథకాలను కర్ణాటక ప్రభుత్వం సమర్థంగా వినియోగించుకున్న వైనం డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో స్పష్టంగా అర్థమయింది. అదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం అభివృద్ధి ఆధారిత పాలన వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగి లేని కుటుంబం పల్లెల్లో కూడా లేదంటే ఆశ్చర్యం కాదు. అక్కడ కనిపించిన నిజం. గతంలో ఇలా పథకాలు అందడానికి లేదా.. ఉద్యోగాలు రావడానికి.. మెరుగైన వసతులు ఏర్పడటానికి మా ప్రభుత్వమే కారణం అని వారిని నమ్మించాడనికి ప్రయత్నించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రజలకు అన్నీ తెలుస్తున్నాయి. ఎవరెవరు ఏమీ చేశారో వారికి చెప్పాల్సిన పని లేదు. వారు చాలా స్పష్టంగా ఉన్నారని నాకు మొదటి రెండు రోజుల్లోనే అర్థమయింది.

తెలుగు వారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటనల తర్వాత.. బెంగళూరు ఇతర చోట్ల తెలుగు కమ్యూనిటీతో సమావేశాలు నిర్వహించాం. అనారోగ్యం నుంచి కోలుకున్న కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశాల్లో మేము ఊహించని స్పందన వచ్చింది. సాధారణంగా ఓటింగ్ కు వెళ్తారేమో కానీ ఇలా రాజకీయ పార్టీలు పెట్టే కమ్యూనిటీ సమావేశాలకు కర్ణాటకలోని తెలుగు వారు పెద్దగా రారు. కానీ బీజేపీ పెట్టిన సమావేశాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారిలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కలుగుతున్న మేలును తాము పొందుతున్నామన్న స్పష్టత కనిపించింది. ప్రత్యేకంగా వారందర్నీ మేను ఓటు వేయాలని అడగాల్సిన పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే వారే.. తమ చాయిస్ బీజేపీనని చెప్పారు.

అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలో విస్తృత ప్రచారం చేశారు. ఆ స్థాయిలో ఉన్న నేత.. పార్టీ కోసం ఎలా పని చేస్తారో ఈ ప్రచారం స్పష్టం చేసింది. పార్టీ కోసం ఆయన కార్యకర్తలా కష్టపడతారు. మోదీ గారి బహిరంగసభల నిర్వహణలో కొన్ని బాధ్యతల్ని నాకు అప్పగించారు. ఆ సమయంలో ప్రజల స్పందన చూసినప్పుడు కర్ణాటకలో బీజేపీ తప్ప వేరే పార్టీకి చాయిస్ లేదని క్లారిటీ వచ్చింది. ప్రధాని మోదీతో ఈ సందర్భంగా ఓ నిమిషం మాట్లాడటం .. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ గురించి ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోలేని అనుభవం.

మొత్తంగా కర్ణాటకలో రెండు వారాల పాటు విస్తృతంగా చేసిన ప్రచారంలో నేను గుర్తించినదేమిటంటే… అవినీతి అని.. మరొకటి అని బీజేపీకి వ్యతిరేకంగా చేసిన ప్రచారం.. మీడియా, సోషల్ మీడియాల్లో మత్రమే ఉంది. అసలు ప్రజలు, ఓటర్లలో మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మారిన .. మారుతున్న బతుకు చిత్రమే కనిపిస్తోంది. అందుకే కర్ణాటక ఓటర్లు మరోసారి కమల వికాసానికి సిద్ధమయ్యారని నాకు స్పష్టంగా అనిపించింది.