గరుడుడి వివిధ సందేహాలపై శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వివరణే గరుడ పురాణం. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏంటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది లాంటి విషయాలు ఉంటాయి. నిత్య జీవితంలో ఆచరించే విధి విధానాలపైనా ఇందులో ప్రస్తావన ఉంటుంది. ఇందులో భాగంగా శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు ఉండాలంటే ఈ 5 అవలక్షణాలు ఉండకూడదు. వీటిని వీడకపోతే ఆ వ్యక్తులు మరణించేవరకూ పేదలుగానే ఉండిపోతారని శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పాడు. ఆ ఐదుగురు ఎవరు, ఎలాంటి అవలక్షణాలు ఉండకూడదో చూద్దాం..
- సూర్యోదయం కన్నా ముందే నిద్రలేవాలి
సూర్యోదయం కన్నా ముందు..అంటే..బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులు ఎప్పుడూ ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు. సూర్యోదయం తర్వాత నిద్రలేవడం అంటే జ్యేష్ఠాదేవిని ఇంట్లోని ఆహ్వానిస్తున్నట్టే లెక్క. అలాంటి ఇంట్లో వ్యక్తులు ఎంత కష్టపడినా శ్రీ మహాలక్ష్మి ఎప్పటికీ కొలువై ఉండదు. - అనవసర కోపం, చిరాకు
కోపం, చిరాకు ప్రదర్శించేందుకు కూడా ఓ కారణం ఉండాలి. కొందరు మాత్రం ఎలాంటి సందర్భం లేకపోయినా చిటికీ, మాటికీ కోప్పడతాడు. ఎదుటి వ్యక్తిపై అసహనం, చిరాకు ప్రదర్శిస్తుంటారు. తనకు ఉండే అవలక్షణం కారణంగా ఇతరులను బాధపెడుతూ బతికే వ్యక్తి ఎప్పటికీ లక్ష్మీదేవి కరుణకు పాత్రులు కాలేరని వివరిస్తోంది గరుడ పురాణం. - శుభ్రత ముఖ్యం
ఇంటి పరిసరాలు అయినా, వేసుకునే దుస్తుల విషయంలో అయినా శుభ్రత చాలా అవసరం. ప్రదేశాలు చెత్తగా, ఈగలు దోమలు ముసురుతూ, మురికి నీరు చేరి ఉండేచోట సంపదనిలవదు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మరికొందరు వేసిన దుస్తులే ఉతక్కుంటా మళ్లీ మళ్లీ వేస్తుంటారు. స్నానానికి ముందు విడిచిన దుస్తులు స్నానానంతరం తిరిగి వేసుకోరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని సాగనంపడమే కాదు శనికి ఆహ్వానం పలుకుతున్నట్టే - తల్లిదండ్రుల సొమ్ము ఖర్చుపెట్టొద్దు
కంటికి రెప్పలా కాపాడుకుని, విద్యాబుద్ధులు నేర్పించి పిల్లల్ని తీర్చిదిద్దుతారు తల్లిదండ్రులు. వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేరు. ఇవ్వడం మాట దేవుడెరుగు వారినుంచి ఆశించనిదే పూటగడవని సంతానం ఉన్నారు. ఓ వయసు వచ్చి, సంపాదించుకునే శక్తి ఉన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి ధనం తీసుకోకూడదు. వారికి ఇవ్వాలే కానీ ఆశించకూడదు. ఇలా ఆశించే వ్యక్తి ఎంత సంపాదించుకున్నా ఎప్పటికీ పేదవాడిగానే మిగిలిపోతాడు - కష్టాలు చూసి పారిపోకూడదు
సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి కానీ కష్టాలను చూసి దూరంగా పారిపోయే వారు ఎప్పటికీ జీవితంలో ఎదగలేరు. అనుకున్నవి ఏవీ సాధించలేరని గరుడ పురాణంలో ఉంది
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.