పెద్దిరెడ్డి సైలెంట్ – పుంగనూరులో నల్లారి వ్యూహం ఫలించిందా ?

చిత్తూరు జిల్లా వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో వరుసగా నాలుగో సారి గెలవాలని గట్టి ప్రయత్నం చేశారు. అయితే ఈ సారి ఆయనకు నల్లారి రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నల్లారి కిరణ్ రాజంపేట ఎంపీగా నిలబడటం.. పుంగనూరులో టీడీపీ తరపున బలమైన అభ్యర్థి పోటీ చేయడంతో పుంగనూరులో ఫలితంపై భిన్న చర్చలు వస్తున్నాయి.

నల్లారి, పెద్దిరెడ్డి మధ్య చాలా కాలంగా రాజకీయ వైరం

నల్లారి, పెద్దిరెడ్డిలకి కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచే విభేదాలున్నాయి. ఒకే పార్టీలో ఉన్నా బద్ద శత్రువుల్లా వ్యవహరిస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ నుంచి రాజంపేట ఎంపీగా మిధున్‌రెడ్డిపై పోటీకి దిగారు. మరోవైపు కుప్పంలో తనను ఓడిస్తానంటున్న పెద్దిరెడ్డికి పుంగనూరులో చెక్ పెట్టడానికి చంద్రబాబు బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న చల్లా బాబుని రంగంలోకి దించారు. చల్లాబాబు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీకుడైన పెద్దిరెడ్డిని ఈసారి ఓడిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ తరపున చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిదే రాజ్యం

చిత్తూరు జిల్లాలో మెజారిటీ సీట్లు వైసీపీకి దక్కడం వెనక పెద్దిరెడ్డి కీలక పాత్ర వహించారు. గత ఎన్నికల్లో తన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డిని తంబల్లపల్లి ఎమ్మెల్మేగా, కొడుకు మిధున్‌రెడ్డిని రాజంపేట ఎంపీగా గెలిపించుకున్నారు. ఈ సారి పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఆ ముగ్గురూ పోటీలో ఉంటే. ఆయన్ని బద్ద శత్రువుగా చూసే చంద్రబాబు, నల్లారి సోదరులు ఇద్దరూ బరిలో ఉండటంతో ఎన్నికలు అందరికీ వ్యక్తిగత ప్రతిష్టగా మారాయి. జిల్లా రాజకీయాలను శాసిస్తున్న పెద్దిరెడ్డిని సొంత సెగ్మెంట్ పుంగనూరులో ఓడించడానికి ఈ సారి ఆయనకు బలమైన ప్రత్యర్థిగా చల్లా బాబును ఎంపిక చేశారు చంద్రబాబు పెద్దిరెడ్డిని పుంగనూరు, రాజంపేట ఎంపీ స్థానాలకు కట్టడి చేసి జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టడానికి ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా పావులు కదిపింది.

కిరణ్ ఎంపీ అభ్యర్థిగా రావడంతో మారిన పరిస్థితులు

మరోవైపు మిత్రపక్షం బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా చంద్రబాబుకు జత కలిసారు మాజీ సీఎం కిరణ్ రాజంపేట ఎంపీగా రెండు సార్లు గెలిచిన మిధున్‌రెడ్డిని ఓడించి జిల్లాలో పెద్దిరెడ్డి పెత్తనానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. మిధున్‌ని ఓడించి పెద్దిరెడ్డి కుటుంబంపై పైచేయి సాధిస్తానన్న ధీమా కిరణ్ వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇన్నాళ్ళూ సరైన ప్రత్యర్ధి లేకపోవడంతో రెండు సార్లు తండ్రి, కొడుకులు గెలిచారని ఇప్పుడు అసలు ఆట మొదలైందని నల్లారి అనుచరులు అంటున్నారు. పుంగనూరు టీడీపీ అభ్యర్ధి చల్లా బాబు కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. ఈ సారి పెద్దిరెడ్డిపై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కిరణ్‌ని ఎంపీగా గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతారని ఆయనతోనే నియోజకవర్గ అభివృద్ది సాధ్యమని ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు.

సైలెంట్ అయిన పెద్దిరెడ్డి

అదలా ఉంటే పెద్దిరెడ్డి ప్రాబల్యం తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో చాలాకాలంగా సైలెంట్ అయిన పలువురు రెడ్డి వర్గం నేతలు నల్లారికి సహకరించారంటున్నారు. తన ప్రధాన ప్రత్యర్ధులు చంద్రబాబు, కిరణ్‌ల కాంబినేషన్‌, సొంత కులంలో వస్తున్న వ్యతిరేకతతో అలెర్ట్ అయిన పెద్దిరెడ్డి సిఎం జగన్ ను అప్పట్లో జైల్లో పెట్టించింది కిరణ్‌కూమార్‌రెడ్డే అని ప్రచారం చేశారు. ఈ సారి అక్కడ 86.62 పోలింగ్ శాతం నమోదైంది .. పోలింగ్ తర్వాత పెద్దిరెడ్డి సైలెంట్ గా ఉండటం… ఆయన వ్యాపారాలను విదేశాలకు తరలిస్తూండటం హాట్ టాపిక్ గా మారింది.