ఇద్దరు పెద్దలు కొట్టుకుంటే మధ్యలో మూడో వ్యక్తి నలిగిపోతారంట. ఏదో ఆశించి నిరీక్షించే వారికి అది దక్కకపోగా ఉన్నది పోయే దుస్థితి వస్తుంది. ఇప్పుడు పవార్ కూతురు సుప్రియా సూలే పరిస్థితి అలాగే ఉంది. ఎన్సీపీలో తాజా రాజకీయ సంక్షోభం ఎదుగుతున్న ఆమె నాయకత్వానికి సవాలుగా మారింది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాస్త డమ్మీ
శరద్ పవార్ తన కూతురు సుప్రియా సూలేకు ఇటీవలే ఎన్సీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఆ పని జరిగి నెల కాకముందే అజిత్ పవార్ ఫిరాయించి మహారాష్ట్ర ఎన్డీయేలో చేరిపోయారు. ఆయన వర్గమే నిజమైన ఎన్సీపీగా మారిన నేపథ్యంలో పవార్ వారసురాలిగా సుప్రియా సూలేకు కష్టమొచ్చి పడింది. వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో మహారాష్ట్ర ఇంఛార్జ్ గా ఏదో సాధిద్దామనుకుంటే మొదటికే మోసం వచ్చిందని ఆమె భావిస్తున్నారు.
మూడు సార్లు బారామతి ఎంపీ..
మహారాష్ట్రలోని బారామతి ..ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కు కంచుకోట. 1990ల్లో ఆయన అక్కడ నుంచి ఎంపీగా ఉండేవారు. 2010 నాటికి తన కూతురుని వారసురాలిగా తీర్చిదిద్దే క్రమంలో ఆమెకు బారామతి ఎంపీ సీటును వదిలిపెట్టారు. ఆమె అక్కడ నుంచి వరుసగా మూడో సారి గెలిచారు. అజిత్ పోకడలపై అనుమానంతో ఈ ఏడాది జూన్ 10న సూలేకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. అక్కడే అజిత్ కు డౌట్ వచ్చింది. పార్టీపై తన పట్టును తగ్గించేందుకు శరద్ పవార్ స్కెచ్ వేస్తున్నారని ఆయనకు అర్థమైంది. అపర చాణుక్యుడైన పవార్ కు అవకాశం తనను పూర్తిగా ఇంటికి పంపి, పార్టీని సూలే చేతుల్లో పెట్టేస్తారని అనుమానించారు. అందుకే జూలై 2న మిట్టమధ్యాహ్నం తిరుగుబాటు చేశారు.
అర్బన్ కే పరిమితమైన సూలే..
రాజకీయంగా ఎదిగే క్రమంలో సూలే కొన్ని పొరపాట్లు కూడా చేశారు. అజిత్ పవార్ గ్రామీణ ప్రాంతాల్లో దూసుకుపోతుంటే ఆమె పట్టణ ప్రాంతాలకు పరిమితమయ్యారు. సెలబ్రిటీలతో తిరగడం, ఆంగ్లోఫైల్ గా పేరు తెచ్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడ్డారు. నిజానికి 2024 ఎన్నికల నాటికి సూలేను శక్తిమంతమైన నాయకురాలిగా తీర్చిదిద్ది మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని శరద్ పవార్ కలలుగన్నారు. మహారాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రి ఆమే అవుతారని పార్టీలో కొందరు ఎదురుచూశారు. అయితే పవార్ ఆలోచించినంత వేగంగా ఆమె పనిచేయలేకపోయారు. పార్లమెంటు ప్రసంగాలు చేసినంత సులభంగా క్షేత్రస్థాయిలో జనంతో కనెక్ట్ కాలేకపోయారు. ఈ లోపే అజిత్ పవార్ లాగేశారు. అందుకే ఇప్పుడొక మాట వినిపిస్తోంది. తొందరపడి ఆమెకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వకపోతే పరిస్థితి ఇలా ఉండేది కాదని చెబుతున్నారు. అజిత్ పవార్ కొన్ని రోజులు ఆగేవాడని అంటున్నారు. అయినా అంతా అయిపోయాక ఇప్పుడు చేయగలిగిందేముంది..