మంగళగిరిలో 2 రోజులు పవన్ సీక్రెట్ మీటింగ్స్ – డీల్ సెట్ అయినట్లేనా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు మంగళగిరిలో ఉన్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మామూలుగా ఆయన వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు జనసేన సోషల్ మీడియా కూడా.. అన్నొచ్చాడు.. వెళ్లాడు తరహాలో ఎలివేషన్లు ఇస్తుంది.కానీ ఈ సారి మాత్రం అలాంటివి పెద్దగా చేయలేదు. దీంతో ఆయన సీక్రెట్ మీటింగ్స్ కోసం వచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాడేపల్లిలో చంద్రబాబుతో సమావేశం అయ్యారా ?

రెండు రోజుల కిందట మంగళగరి వచ్చిన పవన్..శుక్రవారం పార్టీకార్యాలయంలో కొత్తగా నిర్మించిన ఓ బ్లాక్ ను ప్రారంభించారు. అంతకు ముందు రోజు ఏం చేశారన్నది స్పష్టత లేదు. ఆయన రహస్యంగా ఉండవల్లిలో చంద్రబాబును కలిశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ చేయించిన సర్వేలు, బలమైన స్థానాలు ఇతర అంశాలపై చర్చించినట్లుగా భావిస్తున్నారు. అయితే పవన్ సమావేశాలపై జనసేనలోని అత్యున్నత వర్గాలకు కూడా సమాచారం లేదు.

పార్టీ ఆఫీసు దగ్గర కనిపించని నాదెండ్ల

సాధారణంగా మంగళగిరికి పవన్ వస్తే నాదెండ్ల పక్కనే ఉంటారు.కానీ ఈ సారి పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ కనిపించలేదు. గురువారం నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉన్న ఆయన పార్టీ కీలక నేతలతో పెద్దగా మాట్లాడటం లేదు. కానీ కొన్ని సర్వే సంస్థల ప్రతినిధులతో సమావేశం అయినట్లుగ జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ సర్వే సంస్థల ప్రతినిధులతో జరిగిన భేటీల్లో నాదెండ్ల లేరని చెబుతున్నారు. జనసేనకు ఏ ఏ స్థానాల్లో బలం ఉందో తేల్చుకునేందుకు ఆయన కొన్ని సర్వే సంస్థలకు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలిచేందుకు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనసేనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. తాజాగా సర్వేల్లో వస్తున్న ఫలితాలను బట్టి.. తెలుగుదేశం పార్టీ దగ్గర సీట్ల కోసం ప్రతిపాదనలు పెట్టనున్నట్లుగా చెబుతున్నారు.

పవన్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ

పొత్తులు, పోటీ చేసే సీట్ల విషయంలో పార్టీ నేతలతో చర్చించేందుకు పవన్ కల్యాణ్ ఇష్టపడటం లేదని చెబుతున్నారు. ఆ విషయాలను తనకు వదిలేయాలని చెబుతున్నారు. తన నిర్ణయాన్ని శిరసావహించేవారే పార్టీ నేతలని.. వ్యతిరేకించేవారిని పట్టించుకోనని ఆయన చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్నదానిపైనా స్పష్టత లేదు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లో పోటీ చేయడం వల్ల అక్కడ గెలుస్తారులే అని భీమవరం వాసులు.. భీమవరంలో గెలుస్తారులో అని గాజువాక వాసులు అనుకుని ఓటింగ్ తగ్గించడంతో ఆయన రెండు చోట్ల రెండో స్థానానికే పరిమితం అయ్యారు. ఈ సారి భారీ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో ఉన్నారు.