జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రసంగాల్లో గాడి తప్పి వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఓ ప్రసంగంలో సూపర్ స్టార్ కృష్ణపై విమర్శలు చేయడం రాజకీయదుమారం రేపుతోంది. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్.. తనపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత దూషణల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా గతంలో రాజకీయ నేతలు ఎంత హుందాగా ఉండేవారో చెప్పుకొచ్చారు. అలాంటి హుందా రాజకీయాల్లో కృష్ణ – ఎన్టీఆర్ మధ్య జరిగిన రాజకీయాల్ని ప్రస్తావించారు. అప్పట్లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ లో ఉండేవారని, ఎన్టీఆర్ ను కృష్ణ విమర్శించినా… ఎన్టీఆర్ ఎప్పుడూ కృష్ణను పల్లెత్తు మాట అనలేదని అన్నారు.
కృష్ణ ప్రస్తావన తేవడంపై నరేష్ విమర్శలు
ఎన్నికల ప్రసంగంలో పవన్ కల్యాణ్ ..సూపర్ స్టార్ కృష్ణను విమర్శించారని తెలిసిన షాక్ కు గురయ్యారని నటుడు నరేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కృష్ణ గారి మనసు బంగారమన్నారు. పార్లమెంటు సభ్యుడిగా నైతిక విలువలకు పెద్దపీట వేశారని.. సినీ రంగానికి, రాజకీయ రంగానికి ఆయన అందించిన సేవలు గొప్పవన్నారు. కృష్ణ తన రాజకీయ ప్రసంగాల్లో ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎవర్నీ కించపర్చలేదన్నారు. భవిష్యత్ లో అలాంటి మాటలు ఇక పవన్ అనవద్దని పవన్ను కోరారు. ఓ నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కల్యాణ్ అంటే తనకెంతో గౌరవం ఉందని నరేష్ తెలిపారు. పవన్ లో తాను ఏపీ భవిష్యత్ ను చూస్తున్నాను అని నరేశ్ మరో ట్వీట్ లో వెల్లడించారు.
మాజీ బీజేపీ నేత నరేష్
నరేష్ మాజీ బీజేపీ నేత. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి రాజకీయాలు చేశారు. ఏపీకి పునర్ వైభవం కల్పించేందుకు ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించాలని బీజేపీ మాజీ యువజన అధ్యక్షుడిగా, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శిగా కోరుకుంటున్నానని ఆయన చెబుతున్నారు. ఈ అంశంలో పవన్ కల్యాణ్ .. సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగాల్లో కంటిన్యూటీ ఉండదని ఏది గుర్తుకు వస్తే అది ప్రసంగిస్తారన్న విమర్శలు చాలా రోజుల నుంచి ఉన్నాయి.
కూటమికి ఇబ్బందికం
కృష్ణ ఇప్పుడు రాజకీయాల్లో లేరు.. అసలు జీవించి లేరు. అప్పట్లో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పి ఆయనను తప్పు పట్టాల్సిన పని లేదు.దీని వల్ల కూటమిపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పవన్ ప్రసంగాల్లో సంయమనం పాటించాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.