తిరపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం ఎట్టకేలకు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. అధికార పార్టీ ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆరణి శ్రీనివాసులును తిరపతి జనసేన అభ్యర్థిగా ప్రకటించారు కానీ.. జనసేన, టీడీపీ నేతలు అంగీకరించలేదు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి సుగుణమ్మ మీడియా ముందు తన సంతప్తిని వెళ్లగక్కుతో కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటి నుంచి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. జనసేన పార్టీలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కిరణ్ రాయల్ మొదట్నుంచి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూ, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆదేశిస్తే తప్ప తాను ఏమి చేయనని భీక్ష్మించుకుని కూర్చున్నారు.
పరిస్థితులు చేయి దాటడంతో రంగంలోకి పవన్ క్లయాణ్
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం, మరోపక్క అసంతప్తి నేతలు పట్టు వీడకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ నే స్వయంగా రంగంలోకి దిగారు. తిరుపతి పంచాయతీని సెట్ చేస్తానని ఆగ మేఘాల మీద విజయవాడ నుంచి తిరుపతిలో వాలారు. పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తారనే విషయం ఆ పార్టీ నేతలకు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి సమాచారం లేదు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ వస్తారన్న విషయం కన్ఫర్మ్ అయింది. అయినా అంత అయోమయమే ఎప్పుడొస్తాడు ఎక్కడకి వస్తారు ఎవరితో మాట్లాడతారు అనేదంతా సస్పెన్స్ గానే పెట్టారు.
చివరి క్షణంలో గ్రాండ్ రిడ్జ్ హోటల్‌లో సమావేశం
మొదటగా ఎన్వీ ప్రసాద్ ఇంట్లో సమావేశం నిర్వహించినట్లు పార్టీ నాయకులు సమాచారం అందింది. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, అటు నుంచి నేరుగా తిరుచానూరు సమీపంలోని గ్రాండ్ రిడ్జి హౌటల్కు చేరుకున్నారు. రాత్రి 8 గంటల నుంచి పది గంటల వరకు టిడిపి నాయకులతో చర్చలు నిర్వహించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చొరవ, సూచనతో సమావేశానికి హాజరైన 28 మంది టిడిపి సీనియర్ నాయకులు జనసేన పార్టీకి సహకరిస్తామని పవన్ కళ్యాణ్ కు హామీ ఇచ్చారు. తర్వాత జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. కిరణ్ రాయల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
అందరూ కలుస్తారా ?
నాగబాబు మాట్లాడుతూ ఆరని శ్రీనివాసులు గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పని చేసేలా కళ్యాణ్ ఒప్పించారని నాగబాబు ప్రకటించారు. పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తామని వెల్లడించారు. పవన్ ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి మరీ చేసిన బుజ్జగింపులు ఫలిస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.