జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేదానిపై క్లారిటీ లేదు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాలనుకుంటున్నారు. పొత్తు ఖరారు కావడంతో ఎక్కడ పోటీ చేసినా గెలుపు ఖాయమనుకుంటున్నారు. కానీ ఎక్కడ పోటీ చేయాలన్నదానిపై స్పష్టత లేదు. అనంతపురం నుంచి తిరుపతి నుంచి మొదలెడితే కాకినాడ రూరల్, పిఠాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం వంటివి కూడా ఉన్నాయి. ఇక 2019లో పవన్ పోటీ చేసి ఓడిన విశాఖలోని గాజువాక సీటు కూడా ఆ జాబితాలో ఉంది. ఇప్పుడు గాజువాక పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని అంటున్నారు
ఎక్కడ పోటీ చేస్తానో ఇంకా చెప్పని పవన్
గాజువాకలో పవన్ వారాహి యాత్ర చేసినప్పుడు మంచి స్పందన లభించింది. దాంతో ఓడినా కూడా తనకు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించడం కంటే ఆనందం వేరొకటి లేదని అన్నారు. అసలు 2019లో తనను ఎందుకు ఓడించారో అని కూడా మధనపడ్డారు. పవన్ కళ్యాణ్ గాజువాకలో కిక్కిరిసిన జన సందోహం మధ్య సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తనను గెలిపించి ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరిగి ఉండేదని అన్నారు. గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే జనసేనకు విరగబడి జనాలు గాజువాకకు రావడంతో పవన్ లో ఆనందం వెల్లి విరిసిందింది.
2024లో గెలిచి తీరుతానన్న పవన్
2019లో ఓటమి లభించింది కానీ 2024లో మాత్రం కచ్చితంగా తాము గెలిచి తీరుతామని అన్నారు. ఈసారి ఎన్నికల్లో గాజువాక జనసేన సొంతం అయి తీరుతుందని చెప్పుకొచ్చారు. గాజువాకలో జనసేన పోటీ చేస్తుందని చెప్పేశారు. మరి జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తారు అన్నది అయితే ఆయన చెప్పలేదు. పవన్ కళ్యాణ్ నే మళ్లీ పోటీ చేయమని పార్టీ క్యాడర్ కోరుతోంది. ఓడిన చోటనే గెలిచి ప్రత్యర్ధుల నోళ్ళు మూయించాలన్నది జనసేన నాయకుల ఆలోచన. అదే విధంగా పవన్ కనుక గాజువాక నుంచి పోటీ చేస్తే ఉత్తరాంధ్రా జిల్లాలలో జనసేనకు అది ఎంతో బలంగా సానుకూలంగా ఉంటుందని అంటున్నారు. అయితే పవన్ మనసులో కూడా గాజువాక ఉందని అంటున్నారు. సరైన సమయంలోనే ఆయన తన అభిప్రాయాన్ని బయటపెడతారు అని అంటున్నారు.
సభ్యులంతా ఓటు వేయలేదు !
2019 ఎన్నికల ముందు గాజువాకలో జనసేనకు 95 వేల సభ్యత్వం ఉంది. దాంతో అది బలమైన సీటుగా భావించి పోటీ చేశారు. అయితే సభ్యత్వం తీసుకున్న వారు అంతా ఓటేయరని ఆ తరువాత అర్ధం అయింది. ఇపుడు కూడా పవన్ సభలకు జనాలు విరగబడి వస్తున్నారు అలా వచ్చిన వారు అంతా ఓటేస్తారా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా గతంతో పోలిస్తే జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. అదే టైం లో ఇదే గాజూవాకలో టీడీపీకి వైసీపీకి బలమైన ఓటింగ్ ఉంది. అందుకే గెలుపు ఖాయమనుకుంటున్నారు.