పారిశ్రామిక కేంద్రంగా పవిత్ర పుణ్య క్షేత్రం
ప్రయాగ్ రాజ్ గంగమ్మ తల్లికి ముద్దబిడ్డగా చెప్పుకోవాలి. త్రివేణీ సంగమ పుణ్య ప్రదేశంగా ప్రతీ భారతీయుడు సందర్శించే నగరం కూడా అదే. జీవితంలో ఒకసారినా ప్రయాగ్ రాజ్ సందర్శించి త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే అన్ని పాపాలు హరించుకుపోయి అంతా మంచే జరుగుతుందన్న విశ్వాసం భారతీయులది. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు స్థిరపడిపోయినప్పటి నుంచి ప్రయాగ్ రాజ్ ను ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా పారిశ్రామిక కేంద్రబిందువుగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఆ దిశగా ప్రయాగ్ రాజ్ జిల్లాను ప్రాధాన్యప్రాంతంగా మార్చేశారు..
ప్రయాగ్ రాజ్ రూపురేఖలు మార్చిన ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్
ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు లక్నోలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ప్రయాగ్ రాజ్ నగరంలో పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలో రూ. 53 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి సెప్టెంబరు నాటికి మొత్తం 83 కంపెనీలకు శంకుస్థాపన చేస్తారు.
రూ. 10 వేల కోట్ల పనులు ప్రారంభం
ఉత్తర ప్రదేశ్ పరిశ్రమల శాఖ కమిషనర్ అందించిన సమాచారం ప్రకారం ఇప్పటికే రూ. 10,046 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. ఇంధన రంగంలో అత్యధికంగా రూ. 3,702 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. చిన్న – మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ. 1,081.45 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. కొత్త పెట్టుబడుల కారణంగా ప్రయాగ్ రాజ్ జిల్లాలో 12 వేల మంది యువకులకు ఉద్యోగావకాశాలు కలుగుతాయి. పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఖాయమవుతుంది. పైగా గృహవసతి రంగంలో ఎనిమిది వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ చర్యల కారణంగా ప్రయాగ్ రాజ్ జిల్లా ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
నీటి ఎద్దడి ఉండదంటున్న అధికారులు
ప్రయాగ్ రాజ్ జిల్లా నిత్యం యాత్రికులు తిరిగే ప్రాంతం. ఇప్పుడు పారిశ్రామిక ప్రగతి కారణంగా జనాభా కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు గంగా, యమునా నదుల నుంచి నీటిని అన్ని అవసరాలకు వాడుతున్నారు దానితో పాటుగా ఇప్పుడు చిన్న నదులైన కర్ణావతి, లాప్రీని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు నదులకు పునరుత్తేజం కలిగిస్తే పరిసర ప్రాంతాల అవసరాలు తీర్చడంతో పాటు పరిశ్రమలకు నీరు అందించే ఆలోచన చేయవచ్చని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఉపాధి హామీ పనులను నదుల పునరుద్ధరణ పనులకు అనుసంధానం చేయడం ద్వారా నీటి లభ్యతను పెంచుతారు. రుతుపవన కాలంలో నదలోకి వచ్చే నీటిని ఒడిసి పట్టుకునేందుకు కొంచెం ముందు నుంచే నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించారు. ఇవే నదులతో అనేక పంచాయతీలకు తాగు నీరు కూడా అందిస్తారు.