దేశ్ కీ నేత నోరు పెగలట్లేదేంటి ? కుర్చీ కిందకు నీళ్లొచ్చాయని తెలిసిపోయిందా ?

తెలంగాణ సీఎం , భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నోరు పెగలడం లేదు. ఆయనదే కాదు.. జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రతినిధి కవిత కూడా మాట్లాజలేకపోతున్నారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీని లేకుండా చేద్దామని చేతులు కలుపుదామని తెగ ఉత్సాహపడి.. అందరితోనూ ప్రత్యేక విమానాల్లో వెళ్లి మాట్లాడి వచ్చిన వారంతా ఇప్పుడు కేసీఆర్ మాట కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం స్పందించడం లేదు.

మద్దతు కోసం చూస్తున్న కేజ్రీవాల్

ఢిల్లీ ప్ర‌భుత్వ అధికారుల బ‌దిలీలు, పోస్టింగ్‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్య‌తిరేకిస్తూ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు వివిధ పార్టీలు సంఘిభావం తెలిపాయి. ఆర్డినెన్స్‌కు వ్య‌తిరేకంగా విపక్షాలు ప్రకటనలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని జాతి పోరాటంగా చెబుతున్న అర‌వింద్ కేజ్రీవాల్ అందర్నీ కలిసి రావాలని కోరుతున్నారు. ది కేవ‌లం త‌మ పోరాట‌మే కాద‌ని ఇది దేశవ్యాప్త పోరాట‌మ‌ంటన్నారు. మమతా బెనర్జీ కేజ్రీవాల్ ను కలిసి మరీ సంఘిభావం తెలిపారు. అయితే ఆప్తమిత్రుడైన కేసీఆర్ మాత్రం కనీసం కేజ్రీవాల్‌కు సంఘిభావం చెప్పలేదు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఒక్క ప్రకటనా చేయలేదు.

పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపైనా విపక్షాల విమర్శలు – కానీ కేసీఆర్ సైలెంట్ !

మే 28న ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వాధినేత.. శాసనసభకు అధిపతి కాదని.. మోడీ పార్లమెంటును ఎందుకు ప్రారంభించాలని అన్ని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మే 28న ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని.. లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోడీని కలిసి కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు. అయితే ఇది సంప్రదాయాలకు విరుద్దమని రాష్ట్రపతి ప్రారంభించాలని కాంగ్రెస్, తృణమూల్, మజ్లిస్ సహా అన్ని విపక్ష పార్టీలు అంటున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు. మరో వైపు కర్ణాటకలో వచ్చిన ఫలితం తర్వాత బీజేపీని ఓడించడానికి విపక్షాలు కూటమి కట్టేందుకు రెడీ అయ్యాయి. కానీ కేసీఆర్ కు ఆహ్వానం కూడా అందలేదు. కలుస్తామని..కలిసి పని చేద్దామన్న సంకేతాలను కూడా కేసీఆర్ పంపలేదు. ఆయనకూడా వస్తామని చెప్పడంలేదు.

దేశ్ కీ నేత కి జాతీయ రాజకీయాలు విరక్తి పుట్టాయా ?

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చేసి జాతీయ రాజకీయాలు ప్రారంభించిన కేసీఆర్.. జాతీయ అంశాలపై మాత్రం పూర్తి సైలెంట్ గా ఉంటున్నారు. విపక్ష కూటముల సమావేశాల్లో పాలు పంచుకోవడం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు కూడా ప్రకటించలేదు. గత మూడు, నాలుగు రోజులుగా చాలా అంశాలపై బీజేపీపై పోరాడుతున్న నేతలంతా ప్రకటనలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం నోరు తెరవడం లేదు. చివరికి ఆప్తమిత్రుడు కేజ్రీవాల్‌కు సమస్య వచ్చినా మద్దతుగా ఒక్క ప్రకటన చేయలేదు.

పరిస్థితి చూస్తూంటే కేసీఆర్ కు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉందని .. మెరుగుపర్చుకోకుండా.. జాతీయరాజకీయలంటూ తిరిగే ఉన్న కుర్చీ ఊడిపోతుందన్న అభిప్రాయంతో ఉన్నారని అందుకే పరిస్థితుల్ని చక్కదిద్దుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.