గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రాఫ్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనమైంది. రెండు రోజుల క్రితం రాత్రి పదిన్నర ప్రాంతంలో ముగ్గురు దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరపడంతో ఇద్దరు సోదరులు అక్కడికక్కడే చనిపోయారు. లవలేష్ తివారీ, సన్నీ,అరుణ్ మౌర్య అనే ముగ్గురు కలిసి ఈ జంట హత్యలు చేశారు. యావజ్జీవ జైలు శిక్ష పడ్డ అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్ ని వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాగ్ రాజ్ లోని ఎంఎల్ఎన్ మెడికల్ కాలేజీ కి తీసుకొచ్చారు . సెంట్రల్ జైలుకి తరలించే ముందు శిక్ష పడ్డ నేరస్తులకు వైద్య పరీక్షలు చేయడం తప్పని సరి కావడంతో పోలీసులు తమ విధులను నిర్వర్తించారు. ఆ క్రమంలో మీడియాతో మాట్లాడుతుండగానే అతీక్ సోదరులను ముగ్గురు నిందితులు కాల్చిచంపారు. తక్షణమే ముగ్గురిని అరెస్టు చేయగా, విచారణలో వారు తరచూ మాట మార్చుతూ.. పొంతనలేని సమాధానాలిస్తున్నారు..
టర్కీలో తయారైన జిగానా పిస్టల్స్ తో కాల్పులు
లవలేష్ తివారీ, సన్నీ,అరుణ్ మౌర్య ల దగ్గర నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్టల్ Made in Turkeyగా యూపీ పోలీసులు నిర్ధారించారు. పంజాబ్ లో కానీ, కాశ్మీర్ సరిహద్దుల్లో కానీ చొరబాటు దారుల దగ్గర దొరికిన ఆయుధాలలో పిస్టల్,రివాల్వర్,హాండ్ గ్రనేడ్ లాంటివి Made in China వి దొరుకుతాయి. అతీక్ సోదరులను కాల్చిచంపేందుకు వాడిన ఆయుధాలు మాత్రం టర్కీలో తయారైన జిగానా పిస్టల్స్ . దొరికి పోతాము అని తెలిసీ పాయింట్ బ్లాంక్ లో కాల్చడానికి వచ్చారు అంటే వాళ్ళకి పిస్టల్ పేల్చడంలో ముందే శిక్షణ ఇచ్చారని అర్థం చేసుకోవాలి. దొరికితే శిక్ష పడుతుంది అని తెలిసీ యువకులు ముందుకు వచ్చారు అంటే అది పేరు,ప్రతిష్టల కోసం అనేది అబద్ధం. అసలు కారణం వేరే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గురి తప్పకూడదు, కాల్చితే బతక కూడదన్న ఉద్దేశంతోనే జిగానా పిస్టల్స్ ని వాడారు. భారత్ లో బ్యాన్ చేసిన జిగానా పిస్టల్స్.. ప్రస్తుతం పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి ఉగ్రవాదులకు అందుతున్నాయి. అదే మార్గంలో ఆ ముగ్గురు క్రిమినల్స్ కు చేరి ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఒక జిగానా పిస్టల్ కొనడానికి హీన పక్షం 6 నుండి 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది స్మగ్లింగ్ ద్వారా కొంటే రేటు పది లక్షల రూపాయల పైమాటే..
అతీక్ కు ఐఎస్ఐతో సంబంధాలు
పోలీసులు ఇంతవరకు బయటపెట్టక పోయినా చాలా కాలం నుండి అతిక్ అహ్మద్ కి పాకిస్థాన్ గూఢచార సంస్థ ISIతోనూ, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా తో సంబంధాలు ఉన్నాయి. లవలేష్ తివారీ, సన్నీ,అరుణ్ మౌర్య ల దగ్గర దొరికిన పిస్టల్ టర్కీ ది కావడంతో అతిక్ అహ్మద్ హత్య ఐఎస్ఐ పనే అని అర్ధమవుతోంది.
అతీక్ కు ముందే తెలుసా…
తనను చంపేస్తారని అతీక్ ముందు నుంచి చెబుతున్నాడు. అందరూ చూస్తుండగానే తన హత్య జరుగుతుందని 2004లో ఒక ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు. గత 15 రోజులుగా అతీక్ అదే మాటను రిపీట్ చేస్తున్నాడు. తనను ఉత్తర ప్రదేశ్ పంపొద్దని, గుజరాత్ జైల్లోనే ఉంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని అతను మొరపెట్టుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ వెళితే చంపేస్తారని అన్నాడు. తనపై వందకు పైగా కేసులున్న సంగతి కూడా అతను గుర్తుచేశాడు. అయితే పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారన్న అనుమానంతో అతను అలా మాట్లాడుతున్నాడని అనుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అతని శత్రువు కాదని, ఆ శత్రువులు వేరే ఉన్నారని ఈ జంట హత్యలతో వెల్లడైంది..
నిజాలు చెప్పేస్తాడన్న భయంతో…
అతీక్ అహ్మద్ అంతర్జాతీయ లింకులున్న గ్యాంగ్ స్టర్. అతను నిజాలు చెప్పేస్తాడన్న భయంతోనే అడ్డు తొలిగించుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఇంకా విచారించాల్సిన కేసులు చాలానే ఉన్న నేపథ్యంలో వాటి వెనుక ఉన్న పెద్ద తలకాయలు బయటపడతాయన్న అనుమానంతో అతీక్ హత్య జరిగి ఉండొచ్చని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది రాజాకీయ నాయకుల బినామీ ఆస్తులు పాకిస్థాన్ లో ఉన్నాయి. వాటిని అతిక్ అహ్మద్ ద్వారా ISI సహకారంతో కొన్నట్లు తెలుస్తోంది. పైగా ఉత్తర ప్రదేశ్ లో ఏదన్నా విధ్వంసం సృష్టించాలన్నా లేదా ఎన్నికల వేళ నిధులు అవసరమైన పక్షంలో పాకిస్థాన్ లో ఉన్న ఆస్తులని అమ్మేసి ఆ డబ్బుని హవాలా ద్వారా దుబాయ్ కి పంపి..అక్కడ నుండి భారత్ కి పంపే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాటి వివరాలు అతిక్ అహ్మద్ కి మాత్రమే తెలుసు. వాటిని బయటపెడితే కొంతమంది రాజకీయ జీవితం శాశ్వతంగా ముగుస్తుంది !ఒక్క పాకిస్థాన్ లో మాత్రమే కాదు టర్కీ, ఇతర గల్ఫ్ దేశాలలో కూడా కొందరికి బినామీ ఆస్తులు ఉన్నాయి వాటిని అతీక్, అతని సోదరుడు అష్రాఫ్ , అతీక్ కుమారుడు అసద్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ముగ్గురూ చనిపోవడంతో ఆ వివరాలన్నీ శాశ్వతంగా భూస్థాపితం అయ్యాయి..
నిర్వేదంలో అతీక్
కుమారుడు అసద్ ఎన్ కౌంటర్ తర్వాత అతీక్ నిర్వేదంలోకి వెళ్లిపోయాడు. తన కారణంగానే కుమారుడు చనిపోయాడని ఆవేదన చెందాడు. తన కుటుంబం నాశనం కావడానికి తానే కారణమని తెలిసిన వారి వద్ద వాపోయాడు. శ్మశాన వైరాగ్యంలో పడిపోయిన వాడు నిజాలు చెబుతాడనడానికి సైకాలజీ చదవాల్సిన పనిలేదు. అతను నిజాలు చెప్పకముందే శాశ్వతంగా నోరు మూయించేశారు..
బీబీసీ చేసిందేమిటి.. ?
భారత్ పైనా, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపైనా బీబీసీ వార్తా సంస్థ విషం కక్కుతూనే ఉంది. అతీక్ హత్య జరగగానే సదరు BBC వారు ఆ వార్తకి పెట్టిన హెడ్ లైన్ ఏమిటో తెలుసా ? Atiq Ahmed Former Indian MP and His Brother shot dead on live TV! ఈ హెడ్ లైన్ చదవగానే విదేశాలలో పాఠకుడు ఎలా అర్ధం చేసుకుంటాడు ? ఓహో ! భారత దేశంలో లా మేకర్స్ కి కూడా భద్రత లేకుండా పోయింది అన్నమాట ! సదరు లింకు మీద క్లిక్ చేసి ఆ వార్త మొత్తం చదివే ఓపిక ఎవరికి ఉంటుంది కానీ బీబీసీకి కావాల్సిన సందేశం ప్రచారం అవుతుంది. ఇతర మీడియా సంస్థ Gangster turned plotician shot dead అని వ్రాసాయి కానీ బీబీసీ మాత్రం ఇండియన్ లా మేకర్ హత్య అని హెడ్ లైన్ తో వార్తని ప్రచురించింది !
తక్షణమే స్పందించిన యోగీ సర్కారు..
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి అతీక్ ని చంపడానికి కారణాలు లేవు. అతను బ్రతికి మిగతా విషయాలు బయటపెడితేనే.. అసలు నేరస్తులు బయటకు వస్తారని యోగీ ప్రభుత్వానికి తెలుసు. ఐఎస్ఐ, లష్కర్ లింకులు కూడా బయటపెట్టాలని యూపీ పోలీసు, ఇంటెలిజెన్స్ ప్రయత్నిస్తున్న తరుణంలో అతీక్ సోదరుల హత్య జరిగింది. హత్య జరిగిన వెంటనే యూపీ ప్రభుత్వం స్పందించింది. ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు సీఎం యోగీ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ ని చేతకాని వాడిగా నిరూపించే ఎలాంటి చర్య ని అయినా ఆయగా గట్టిగానే ఎదుర్కోవాలని నిర్ణయించారు. యూపీ పోలీసు అధికారులతో అతీక్ కు ఉన్న సంబంధాలను, హత్యకున్న లింకులను తేల్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఇంతకంటే ఏం కావాలి..