ఎలుక తోలు తెచ్చి ఎంతెంత రుద్దినా నలుపు నలుపేగాని తెలుపురాదు అంటారు. కుక్క తోక ఎప్పుడూ వంకరేనంటారు. మన పొరుగు రాజ్యం పాకిస్థాన్ తీరు కూడా అంతేనని చెప్పాలి. నిత్యం భారత భూభాగంపై కన్నేసి…మనం అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి పాకిస్థాన్ తన సంకుచిత దృక్పథాన్ని, చిల్లర మల్లర ఆలోచనా విధానాన్ని చాటుకుంటూనే ఉంటుంది..
రామాలయంపై వాళ్లకెందుకో అభ్యంతరం
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశమంతా ఏకమై రామనామస్మరణ చేసింది. భారతీయులంతా సంతోషంగా ఉండటం చూసి పాకిస్థాన్ పాలకులు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పాక్ విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కూల్చివేసిన మసీదుపై ఆలయం నిర్మించడం భారత ప్రజాస్వామ్యానికి శోభనివ్వదని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ప్రజలందరి ఆమోదంతో , కోర్టు తీర్పుతో రామాలయ నిర్మాణం జరిగిందని పాకిస్థాన్ కు తెలియనిది కాదు. ఐనా తన బుద్ధి మార్చుకోలేదు.
కావాలనే కాశీ, మథుర ప్రస్తావన
రామాలయ వ్యవహారాన్ని ప్రస్తావించి పాకిస్థాన్ ఊరుకోలేదు. కాశీలోని జ్ఞానవాపి మసీదు, మథురలోని షాహీ ఈద్ఘా ప్రస్తావన కూడా అదే ప్రకటనలో చేసింది. ఆ రెండు చోట్ల విధ్వంసం ఖాయమని జోస్యం చెప్పింది. నిజానికి రెండు వ్యవహారాలు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. భారత ప్రభుత్వం గానీ, దేశ ప్రజలు గానీ ఎన్నడూ కోర్టు తీర్పును ఉల్లంఘించలేదు. ఎంత జాప్యమైన అత్యున్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు వేచి చూశారు. ఐనా ఇండియాలో మెజార్టీవాదం పెరిగిపోయిందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. భారతీయ ముస్లింలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పక్కకు నెట్టబడుతున్నారని పాకిస్థాన్ వాదిస్తోంది. వాస్తవం చెప్పాలంటే పాకిస్థాన్ కంటే హిందుస్థాన్లోనే మైనార్టీలకు వెయ్యి రెట్ల పూర్తి రక్షణ ఉంది. ఆ సంగతి ఏ ముస్లిం సోదరుడిని అడిగినా చెబుతారు. పాకిస్తాన్లో హిందువులు, క్రైస్తవులు, అహ్మదీలు వివక్షకు దాడులకు గురవున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ ఇటీవలే నిగ్గు తేల్చింది.
500 ఏళ్ల చరిత్ర పాకిస్థాన్ కు తెలియదా…
ఐదు శతాబ్దాల క్రితం రామాలయాన్ని కూల్చిన చరిత్ర పాకిస్థాన్ కు తెలియనిది కాదు. అప్పుడు పాకిస్థాన్ కూడా అఖండ భారతంలో భాగమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం హిందుత్వవాదానికి, హిందూ సంస్కృతీసంప్రదాయాలకు భారతీయులు గౌరవమిస్తున్నారన్న అక్కసు పాకిస్థాన్లో పెరిగిపోయింది.అయితే అయోధ్యలో ప్రధాని మోదీ ప్రసంగం నర్మగర్భంగా పాకిస్థాన్ కు సమాధానం చెప్పేదిగా ఉంది. ‘ప్రాణప్రతిష్ఠ వేడుకతో యావత్ ప్రపంచాన్ని సంధానించాం. అయోధ్యలో జరిగినటువంటి ఉత్సవాలు ఇతర దేశాల్లో కూడా జరిగాయి. శ్రీరాముడు భారతీయుల విశ్వాసం. ఈ దేశానికి ఆధారం.. భారత్లో నియమ నిబంధనలను ఏర్పాటు చేసిందే ఆయన.. భారతీయ వివేచన, గర్వం.. ఘనత ఆయనే. ఆయన విశ్వవ్యాపకుడు.. ఆయన ప్రాణప్రతిష్ఠ చేస్తున్నామంటే.. దాని ప్రభావం కొన్నేళ్లు కాదు… వందలు, వేల సంవత్సరాలు ఉంటుంది. యుగసంధి రూపకర్తలుగా మన తరం ఎంపిక కావడం సంతోషదాయకమైన యాదృచ్ఛిక సంఘటన. వెయ్యేళ్ల తర్వాత కూడా జాతి నిర్మాణంలో మన కృషిని అప్పటి తరం గుర్తుంచుకుంటుంది’ అని తెలిపారు. ప్రపంచాన్ని అనుసంధానించగల ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఒక లెక్కా. ఉఫ్ అని ఊదెయ్యగలరు. అభినందన్ వర్తమాన్ విషయంలో పాకిస్థాన్ ను దారికి తెచ్చిన తీరు అందుకు నిదర్శనంగా నిలుస్తుంది..