జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ ఫ్యాన్స్ ఆన్‌లైన్ యుద్ధం – అసలేం జరుగుతోంది ?

“మహానాడు జరుపుకుంటున్నాం. ఫ్యాన్ వార్స్ వద్దు ” అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోషల్ మీడియాలో చేసిన విజ్ఞప్తిని చూస్తేనే.. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ పై విరుచుకుపడుతున్నారు. దానికి కారణం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడమే. అయితే అది పైకి చెబుతున్న కారణమే. అంతకు మించి ఉందన్న గుసగుసలు వినిపస్తున్నాయి.

పదే పదే ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలు

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలపై దృష్టి పెట్టారు. కానీ టీడీపీ కార్యకర్తలు..నేతలు మాత్రం ఆయన పూర్తిగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావాలని ఎప్పుడు అవసరం వచ్చినా తమకు మద్దతు ప్రకటించాలని అనుకుంటున్నారు. అలా ప్రకటించకపోతే.. చాలు సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటిస్తున్నారు. తరచూ ఇలాంటివి జరుగుతున్నాయి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఓ సారి పిలువలేదు.. మరోసారి పిలిస్తే ఎన్టీఆర్ రాలేదు. రెండు సార్లూ ఎన్టీఆర్ దే తప్పన్నట్లుగా సోషల్ మీడియాలో నిందలు వేశారు. ఇది ఇప్పటికీ సాగుతోంది.

టీడీపీకి మద్దతుగా ఉండటానికి ఇష్టపడని ఎన్టీఆర్

ప్రస్తుతం ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ఉండాలని అనుకోవడం లేదు. ఈ విషయం ఆయన చేతల్లోనే అర్థమైపోతుంది. కనీసం టీడీపీకి మద్దతు అనే భావన వస్తుందని అనిపించేలా చిన్న ప్రకటన చేయాల్సి వచ్చినా ఆయన స్పందించడం లేదు. వీలైనంత వరకూ రాజకీయ ప్రస్తావన లేకుండా ప్రకటన చేస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన వివాదంపై ఎన్టీఆర్ కుటుం బసభ్యులందరూ స్పందించినప్పుడు ఎన్టీఆర్ స్పందన కూడా అలాగే ఉంది. ఇతర విషయాలప్పుడు కూడా అంతే. అందుకే టీడీపీ కార్యకర్తలు ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు.

అమిత్ షాను కలిసినప్పటి నుండి టీడీపీలో భయం

జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా ను కలిసినప్పటి నుండి టీడీపీలో ఓ రకమైన భయం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒక వేళ జూనియర్ రాజకీయ ప్రస్థానం బీజేపీ నుంచి ప్రారంభం అయితే.. మొత్తం టీడీపీ క్యాడర్ బీజేపీ వైపు వస్తుందన్న వారిలో ఉందంటున్నారు. అందుకే ఆయనపై వ్యతిరేకత పెంచేందుకు సోషల్ మీడియాలో ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైతే ఎన్టీఆర్ రాజకీయాలపై ఆసక్తి చూపించలేదు. కానీ టీడీపీ నేతలు ఆయన రెచ్చగొట్టి..రెచ్చగొట్టి.. రాజకీయాల్లోకి తెచ్చినా తెస్తారన్న సెటైర్లు మాత్రం వినిపిస్తున్నాయి.