ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ టిక్కెట్ ఇవ్వలేదన్న కారణంగా అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పదవివి వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు సీఎం జగన్. ఇప్పుడు ఆయన టీటీడీ చైర్మన్ పదవి కాలం పూర్తయింది. మల్లీ వచ్చే ఎన్నికలలో ఆయన టిక్కెట్ ఆసిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ భావిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. 2014లో వైవీ సుబ్బారెడ్డి గెలవగా… 2019లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. మాగుంట వైసీపీలో సైలెంట్ గా ఉంటున్నారు. ఈ సారి ఆయనకు టిక్కెట్ వస్తుందో లేదో చెప్పలేమంటున్నారు.
వైవీ సుబ్బారెడ్డికి కలసి వస్తున్న పరిస్థితులు
వైసీపీలో కూడా సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరోసారి పోటీ చేసే పరిస్థితి లేదనే మాట వినిపిస్తోంది. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తన కుమారుడు పోటీ చేస్తారని ప్రకటించారు. మాగుంట రాఘవ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట కుమారుడు రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇటీవలే బెయిల్ తెచ్చుకున్నారు. వైసీపీ నుంచి మాగుంట కుటుంబానికి ఎలాంటి అండ రావడం లేదనే మాట కూడా వినిపిస్తోంది. దీంతో వైసీపీ అధిష్ఠానంపై మాగుంట ఆగ్రహంతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో మరోసారి ఎంపీగా మాగుంట చేసే పరిస్ఖితి లేదని తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో మాజీ ఎంపీ, ప్రస్తుత టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
టీడీపీకి అభ్యర్థి కరవు – ప్రచారంలోకి బాలినేని పేరు
ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరు. 2014లో చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆయన గట్టి పోటీ ఇచ్చినప్పటికీ గెలవలేకపోయారు. ఇక 2019 ఎన్నికలకు ముందు మాగుంట వైసీపీలో చేరడంతో… ఆయన స్థానంలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును బరిలోకి దింపారు. వాస్తవానికి దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి సై అన్న శిద్ధా రాఘవరావు.. అయిష్టంగానే ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఫలితం కూడా అలాగే వచ్చింది. ఏకంగా 2 లక్షల ఓట్ల తేడాతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు.. ఆ తర్వాత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరడంతో.. టీడీపీని నడిపే నేత కరువయ్యారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందుకే మాజీ మంత్రి బాలినేని శ్రీనివసారెడ్డి పేరు ప్రచారంలోకి తెస్తున్నారు.
పోటీ పడేది వైసీపీ నేతలే !
వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరూ బంధువులే. అయితే రాజకీయ ఆధిపత్య పోరాటంలో ఇరువురికి సరిపడటం లేదు. అందుకే బాలినేని సైలెంట్ గా ఉంటున్నారు. సీఎం జగన్ పిలిచి బుజ్జగించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన టీడీపీతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఇద్దరు వైసీపీ నేతలే ఒంగోలు పార్లమెంట్ కు పోటీ పడనున్నారు.