ఒక్క చేరిక వంద చిక్కులు – ఖమ్మం కాంగ్రెస్‌లో పొంగులేటి సైడ్ ఎఫెక్ట్స్ !

ఒకే ఒక్క సారి ఎంపీగా గెలిచి.. బీఆర్ఎస్ వద్దనుకుని సస్పెండ్ చేసిన నేతను చేర్చుకునేందుకు రాహుల్ గాంధీ కూడా దిగి వచ్చి మాట్లాడాల్సిన దీన స్థితికి చేరిన కాంగ్రెస్ కు ఇప్పుడా చేరికే పెద్ద సమస్య అవుతోంది. ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఆధిపత్య పోరాటానికి బీజం పడినట్లయింది. దానికి తగ్గ పరిణామాలు ఇప్పుడే చోటు చేసుకుంటున్నాయి.

కాంగ్రెస్ ను నమ్ముకున్నవారికి దారి లేనట్లే

ఖమ్మం కాంగ్రెస్‌లో కీలక నేతలుగా భట్టి విక్రమార్క, రేణుక చౌదరి ఉన్నారు. ఇప్పుడు వారికే టిక్కెట్లకు గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది. పొంగులేటి ని బాహుబలి అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు రేవంత్ రెడ్డి లాంటి నేతలు ప్రొజెక్షన్ ఇవ్వడంతో … ఇప్పుడు తన మనుషుల కు టికెట్లు తెచ్చుకుని ఎన్నికల బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పార్టీ అగ్రనేత మల్లు భట్టి విక్రమార్క.. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఎండనకా వాననకా 1360 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా … కనీస గుర్తింపు లేకుండా చేస్తున్నారన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. ఎనిమిది నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను పొంగులేటి తన అనుచర బృందానికి ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ కోసం పదేళ్లుగా ఖర్చు పెట్టుకుంటున్న నేతలు

పలువురు నేతలు నియోజకవర్గాల్లో ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వలసవాదులు పార్టీ టికెట్లను ఎగురేసుకుని వారి అనుయాయులతో పోటీ చేయించాలన్న ప్రయత్నం జరిగితే అడ్డుకుని తీరుతామని ఆశావహులు ఇప్పటికే గట్టి హచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. పినపాక నియోజకవర్గం బరిలో చందా సంతోష్‌ ఉన్నారు. ఆయనకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టికెట్‌ హామీ కుడా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు పొంగులేటి టికెట్‌ ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పాత నేతలు.. పొంగులేటి వెంట వచ్చి నేతల మధ్య పోటీ ఏర్పడుతోంది.

రేణుకాచౌదరి టిక్కెట్ లేనట్లే ?

మాజీ ఎంపీ రేణుకా చౌదరి కి ఈసారి టిక్కెట్ డౌటేనని చెబుతున్నారు . ఎంపీగా పొంగులేటి పోటీ చేస్తారు. చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఆమె రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. గతంలో అదే చెప్పారు. తనకు టిక్కెట్ కేటాయించకపోతే.. రేణుకా చౌదరి ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె టంగ్ పవర్ దెబ్బకు హైకమాండ్ వణికిపోతుంది. అందుకే ముందు ముందు ఖమ్మమం కాంగ్రెస్ లో ముసళ్ల పండుగ ఉంటుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.